మహారాష్ట్ర పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టర్మినల్ గేట్ 1 వద్ద ఎస్ఈజెడ్-3 భవనం 4, 5 అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. భవనం లోపల భారీగా పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక విభాగం 10 యంత్రాలతో మంటలు అదుపు చేశారు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద ప్రాంతం నుంచి మృత దేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు.
టీకాలు భద్రం..
ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి ముగ్గురు శాస్త్రవేత్తలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనతో కరోనా వ్యాక్సిన్ 'కొవిషీల్డ్' తయారీ ప్రక్రియ, సరఫరాపై ఎలాంటి ప్రభావం ఉండదని, ప్రమాదం జరిగిన ప్రాంతం తయారీ ప్రాంతానికి దూరంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
" సీరం ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలోని టర్మినల్ గేట్ లోపలి ఎస్ఈజెడ్-3లో నిర్మాణంలో ఉన్న భవనంలో మధ్యాహ్నం 2.45 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. 4, 5 అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం ముగ్గురిని అక్కడి నుంచి తరలించారు. వ్యాక్సిన్లు, టీకా తయారీ ప్లాంటుకు ఎలాంటి ప్రమాదం లేదు. "
- నమ్రతా పాటిల్, డీసీపీ.
రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్
సమాచారం అందిన వెంటనే తొలుత 3 అగ్ని మాపక యంత్రాలతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత మరో 7 వాహనాలను తరలించారు. సహాయక చర్యలు చేపట్టేందుకు జాతీయ విపత్తు స్పందనా దళాన్ని రంగంలోకి దింపారు.
దర్యాప్తునకు ఆదేశం..
సీరంలో అగ్ని ప్రమాదంపై పుణె మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగం అధికారులను ఆదేశించారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ తెలిపారు.
ఎలాంటి ప్రాణ నష్టం లేదు: సీరం
అగ్ని ప్రమాదంపై స్పందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు సీరం ఇన్స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనవాలా. అగ్ని ప్రమాదంతో పలు అంతస్తులు దెబ్బతిన్నప్పటికీ.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని.. ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి: 'ట్రాక్టర్ ర్యాలీ'పై వీడని సందిగ్ధత- శుక్రవారం మళ్లీ భేటీ