బంగాల్.. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కంచుకోట. మమతా బెనర్జీ పాలనా అడ్డా. 2011 నుంచి ఇప్పటి వరకు ఇక్కడ టీఎంసీదే రాజ్యం. మొత్తం 295 శాసనసభ స్థానాలున్న బంగాల్లో వరుసగా రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏకచ్ఛత్రాధిపత్యం ప్రదర్శిస్తోంది మమత నేతృత్వంలోని టీఎంసీ. అది కూడా 2011లో 184, 2016లో 211 స్థానాల్లో జయకేతనం ఎగురవేసి తిరుగులేని ఆధిపత్యంతో ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకుంది.
ప్రస్తుతం ఎన్డీఏకి బంగాల్ అసెంబ్లీలో ఉన్న బలం 14. దేశమంతటా భాజపా గాలి వీస్తున్న తరుణంలోనూ.. బంగాల్లో టీఎంసీదే పైచేయి అని చెప్పడానికి ఈ గణాంకాలు సరిపోతాయేమో! అయితే 2021లో జరిగే శాసనసభ ఎన్నికల్లో మమత కంచుకోటను బద్దలుకొట్టి బంగాల్లో కాషాయ జెండా ఎగురవేయాలని కమలనాథులు యోచిస్తున్నారు. అందుకోసం ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తున్నారు.
2021 ఎన్నికలకు ధీమాగా..
పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన భాజపా.. ఇటీవల జరిగిన హరియాణా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఒంటరిగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించడంలో కాస్త వెనుకబడింది. బంగాల్‌లోనూ ఇదే జరుగుతుందని కొందరు జోస్యం చెబుతున్నారు. అయినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ.. బంగాల్లో పట్టుసాధించాలని భావిస్తోంది భాజపా. అందుకోసం మరికొద్ది రోజుల్లో జరగనున్న మూడు అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల్లో విజయం సాధించి.. 2021 ఎన్నికలకు ధీమాగా బరిలోకి దిగాలనుకుంటోంది.
ఈ మూడు స్థానాలకే ఉపఎన్నికలు
బంగాల్లోని ఖరగ్‌పుర్ సదర్, కరీంపుర్, కలియగంజ్.. నియోజక వర్గాలకు నవంబర్ 25న ఉప ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరగుతున్న ఎన్నికలు కావడం, బంగాల్‌లోనూ జాతీయ పౌర జాబితా (ఎన్ఆర్సీ) అమలుపై భాజపా, టీఎంసీ మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో ఈ ఉపఎన్నికలు రెండు పార్టీలకు ఓ పరీక్షలా మారాయి. రాష్ట్రంలో ఏ పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయో ఈ ఉపఎన్నికలతో నిర్ధరణ అవుతుందన్నది నిపుణుల విశ్లేషణ.
సాధారణ ఎన్నికల్లో భాజపా హవా..
బంగాల్లో మొత్తం 42 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాజపా గణనీయంగా పుంజుకుని, 18 సీట్లు కైవసం చేసుకుంది. టీఎంసీ బలం గతంతో పోల్చితే 12 స్థానాలు తగ్గింది. 22 చోట్ల మాత్రమే గెలిచింది మమత పార్టీ.
లోక్‌సభ ఎన్నికల తర్వాత టీఎంసీతో తొలిసారి ఎన్నికల కురుక్షేత్రంలో తలపడబోతోంది భాజపా.
"3 స్థానాల ఉపఎన్నికల్లో విజయం సాధిస్తామన్న నమ్మకం మాకుంది. 2021లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీని ఓడించాలని బంగాల్ ప్రజలు బలంగా అనుకుంటున్నారు."
- దిలీప్ ఘోష్, బంగాల్ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు
టీఎంసీ ఎన్నికల అస్త్రం.. ఎన్ఆర్సీ
పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో ఒకింత నిరాశకు గురైన టీఎంసీ.. ఉపఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో తమ ప్రాబవాన్ని తిరిగి పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. బంగాల్లో ఎన్ఆర్సీ అమలు చేస్తామన్న అమిత్ షా వ్యాఖ్యలను.. టీఎంసీ ఎన్నికల ప్రచార అస్త్రంగా మార్చుకుని, ప్రజలను తమవైపు తిప్పుకోవాలని భావిస్తోంది.
కాంగ్రెస్-సీపీఎం కూటమి ఉపఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది.
అన్నీ ప్రశ్నలే...
పార్లమెంట్ ఎన్నికల్లో తమదైన ముద్రవేసిన భాజపాకు ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ రాలేదు. బంగాల్‌లోనూ భాజపాకు ఇదే అనుభవం ఎదురవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి బంగాల్లో కమలనాథుల ఆశలు ఫలిస్తాయా? సెమీఫైనల్‌గా చెబుతున్న ఉపఎన్నికల్లో మమతను ఢీకొని విజయం సాధిస్తారా? ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో చూపిన హవాను మరోమారు కొనసాగించి.. టీఎంసీకి ఝలక్ ఇస్తారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే మరికొద్ది రోజులు వేచిచూడాల్సిందే.