ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీపై దిల్లీ ప్రభుత్వం 20 లక్షల జరిమానా విధించింది. తాన్సేన్ మార్గంలో ఓ భవనం కూల్చివేసిన క్రమంలో ధూళి నియంత్రణ ప్రమాణాలను ఉల్లంఘించినందుకే ఈ జరిమానా వేశామని పేర్కొంది. ఈ పర్యావరణ పరిహారాన్ని 15 రోజుల్లో డిపాజిట్ చేయాలని ఆదేశించింది.
యాంటీ స్మోగ్ గన్స్ ఉంటేనే..
ప్రాజెక్టు సైట్ వద్ద యాంటీ స్మాగ్ గన్ ఏర్పాటు చేయకుండా కూల్చివేత పనులు ప్రారంభించడం గానీ, కొత్త నిర్మాణాలు చేపట్టడం గానీ చేయకూడదని ఆదేశాల్లో పేర్కొంది.
దిల్లీ సర్కారు మార్గదర్శకాలు?
దిల్లీ సర్కారు మార్గదర్శకాల ప్రకారం...20వేల చదరపు మీటర్ల కంటే పెద్ద నిర్మాణాలు, కూల్చివేతలు జరుగుతున్న ప్రదేశాల్లో యాంటీ స్మాగ్ గన్‌లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
అయితే, దిల్లీలో ఇలాంటి ప్రదేశాలు 39 వరకు ఉన్నాయని దిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. వీటిలో ఆరు ప్రదేశాల్లో యాంటీ స్మోగ్ గన్‌లు ఏర్పాటు చేయనందున పనులు నిలిపివేయాలని ఆదేశించినట్లు చెప్పారు.
ఫిక్కీ వద్ద కూడా ధూళి నియంత్రణ ప్రమాణాల ఉల్లంఘన జరిగినందునే పనులు నిలిపివేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఉల్లంఘనలకు పాల్పడిన వారెవరైనా వదిలిపెట్టేది లేదని, కాంట్రాక్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:హార్వర్డ్ బిజినెస్ స్కూల్ డీన్‌గా మళ్లీ భారతీయుడే!