రైతుల ఆత్మహత్యలపై మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్. మానసికంగా బలహీనంగా ఉన్న రైతులే ఆత్మహత్య చేసుకుంటారని, అందుకు ప్రభుత్వాన్ని నిందించలేమన్నారు. అలాంటి ఆత్మహత్యలకు ప్రభుత్వ కారణం కాదని తెలిపారు.
మైసూర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు పాటిల్.
" రైతులు మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. వారి మరణాలకు ప్రభుత్వ విధానాలు కారణం కాదు. రైతులే కాదు పారిశ్రామికవేత్తలూ ఆత్మహత్య చేసుకుంటారు. అన్ని ఆత్మహత్యలు రైతు ఆత్మహత్యలుగానే చెప్పలేం. రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు, కార్యక్రమాలను తీసుకొచ్చాం. ఏ ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోకూడదనేదే మా కోరిక. ప్రాణాలు కోల్పోయిన రైతులకు సంతాపం తెలిపేందుకు వారి ఇంటికి వెళ్లటం వల్ల ఆత్మహత్యలను ఆపలేం. "
- బీసీ పాటిల్, కర్ణాటక వ్యవసాయ మంత్రి.
రైతుల ఆత్మహత్యలు ఆపాలంటే వారి సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు మంత్రి. మైసూర్‌లోని సీఎస్ఐర్ ఆధ్వర్యంలో ఆహార ప్రాసెసింగ్‌కు ప్రోత్సాహం, సాంకేతిక నైపుణ్యాల పెంపు వంటి కార్యక్రమాలు ఈ కోవకే చెందుతాయన్నారు.
గత ఏడాది డిసెంబర్ 3న రైతు ఆత్మహత్యలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పాటిల్. రైతులు తమపై ఆధారపడిన వారి గురించి ఆలోచించకుండా వారి జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తారని పేర్కొన్నారు. దాంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఇదీ చూడండి: లంచం కేసులో సొంత డీఎస్పీని అరెస్ట్ చేసిన సీబీఐ