దేశంలోని అన్ని రకాల ఉల్లిపాయల ఎగుమతులపై నిషేధం విధించటంపై నిరసన బాట పట్టారు రైతులు. ఎగుమతులకు తిరిగి అనుమతినివ్వాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర నాసిక్‌లో ఆందోళనలు చేపట్టారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉల్లిపాయను కిలోకు 20-25 రూపాయలకు విక్రయిస్తున్నారని.. ఎగుమతులను నిషేధిస్తే.. కిలోకు 2 నుంచి 3 రూపాలయలకు ధర తగ్గుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల ఉల్లిని సాగుచేసిన రైతులు భారీగా నష్టపోతారని పేర్కొన్నారు. కొనుగోలు దారుడు రైతుల నుంచి తక్కువ ధరకు కొని తర్వాత అధిక ధరకు అమ్ముకుంటారని వాపోయారు నాసిక్‌లోని ఉల్లి రైతులు.
దేశంలో అన్ని రకాల ఉల్లిపాయల ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. తక్షణమే ఈ నిషేధం అమలులోకి వస్తుందని పేర్కొంటూ విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ (డీజీఎఫ్‌టీ) ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలో ఉల్లిపాయల లభ్యతను పెంచడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. దక్షిణాది రాష్ట్రాల్లో అధిక వర్షపాతం నమోదు కావడంతో పంటలపై తీవ్ర ప్రభావం పడిందని, దీని ఫలితంగా నెలలోనే ఉల్లిధర మూడు రెట్లు పెరిగినట్టు పేర్కొంది.