హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్.. కర్నాల్ జిల్లా కైమ్లా గ్రామంలో నిర్వహించ తలపెట్టిన కిసాన్ మహాపంచాయత్ కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. సభకు వ్యతిరేకంగా నల్లజెండాలతో నినాదాలు చేస్తూ.. అటువైపు వెళ్తున్న రైతులపై బాష్పవాయువును, నీటి ఫిరంగులను ప్రయోగించారు పోలీసులు. సీఎం పాల్గొనదలచిన సభా ప్రాంగణాన్ని రైతులు ధ్వంసం చేశారు. దీంతో ముఖ్యమంత్రి తన సభను రద్దు చేసుకోవాల్సి వచ్చింది.



కార్యక్రమం రద్దు..
సభా ప్రాంగణంలో భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. రైతులు సభలోకి రాకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ వారిని అడ్డుకోలేకపోయారు. రైతులు.. సభాస్థలికి వచ్చి స్టేజీని ధ్వంసం చేశారు. కుర్చీలు, టేబుళ్లను పక్కకుతోశారు. ముఖ్యమంత్రి దిగాల్సిన హెలీప్యాడ్‌ను కూడా తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు భాజపా నేతలు.

కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు మద్దతుగా హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈ సభను నిర్వహించాలని చూశారు. అయితే.. సీఎంను రానివ్వకుండా అడ్డుకున్నారు రైతులు. సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని పునరుద్ఘాటించారు.

ఇదీ చదవండి : కర్షకుల కష్టాలపై గళమెత్తిన చిన్నారి