రైతుల్ని చర్చలకు ఆహ్వానిస్తూ కేంద్రం రాసిన లేఖపై ఇవాళ నిర్ణయం తీసుకుంటామని రైతు సంఘాలు తెలిపాయి. ఈ మేరకు ఓ ప్రకటన వెలువరించాయి.
వ్యవసాయ చట్టాలకు సంబంధించి పంజాబ్‌కు చెందిన 32 రైతు సంఘాలు.. మంగళవారం సమావేశమైనట్లు వెల్లడించారు ప్రతినిధి కుల్వంత్ సింగ్ సంధు. తదుపరి కార్యచరణపై చర్చించినట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే.. కేంద్రం ప్రతిపాదనపై దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాలతో బుధవారం చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: ఇక రోజూ 5 వేల మందికి శబరిమల దర్శనం
బ్రిటన్ ప్రధానిని రానివ్వం..
కేంద్రం రాసిన లేఖలో కొత్త అంశాలేవీ లేవని రైతు సంఘం నేత కుల్వంత్. ఇకముందు ఆందోళనలు మరింత ఉద్ధృతం చేయనున్నట్లు హెచ్చరించారు. జనవరి 26న భారత్‌కు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రానున్న నేపథ్యంలో.. ఆయనను రావొద్దని బ్రిటీష్ ఎంపీలకు లేఖ రాయనున్నట్లు వెల్లడించారు.
రైతులు చర్చలకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌ల నుంచి వచ్చిన మరో 2 రైతు సంఘాలతో ఆయన మంగళవారం భేటీ అయ్యారు. రైతులు.. చట్టాలకు మద్దతిచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
చర్చలు విఫలం..
కేంద్రం, రైతుల మధ్య డిసెంబర్ 9న జరగాల్సిన ఆరో దశ చర్చలు రద్దయ్యాయి. 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేయగా.. కేంద్రం అందుకు ససేమీరా అంది. సవరణలు చేసేందుకు సిద్ధమని తేల్చిచెప్పింది. చర్చించి సలహాలు ఇవ్వాలని సూచించింది. ఇరువర్గాలు తమ వైఖరులకు కట్టుబడి ఉండటంతో ఇప్పటివరకు జరిగిన చర్చలు విఫలమయ్యాయి.
ఇదీ చూడండి: 'ఈ చట్టాలు వ్యవసాయంలో కొత్త యుగానికి నాంది'