పార్లమెంట్లో వార్షిక పద్దును ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలపై ప్రసంగించిన అనంతరం బడ్జెట్ అంశాలను వెల్లడించారు. దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు హామీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి కోసం 16 సూత్రాల ప్రణాళికను ప్రకటించారు.
" 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపునకు కట్టుబడి ఉన్నాం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా 6.11 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం పెంచడంపై దృష్టి సారించాం. కృషి సించాయి యోజన ద్వారా సూక్ష్మ సాగునీటి విధానాలకు ప్రోత్సాహం కల్పిస్తున్నాం. పొలాలు, రైతుల ఉత్పాదకత పెంచడం ద్వారా ప్రయోజనం చేకూరుస్తున్నాం. వ్యవసాయ విపణులను మరింత సరళీకరించాలి. వర్షాభావ జిల్లాలకు అదనపు నిధులు, సౌగునీటి సౌకర్యాలు కల్పించేలా ప్రాధాన్యమిస్తున్నాం. "
- నిర్మలా సీతారామన్, కేంద్ర విత్తమంత్రి.
గోదాముల నిర్మాణం..
రైతులకు 20 లక్షల సోలార్ పంపుసెట్లు, బీడు భూముల్లో సోలార్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు పెట్టుబడి సాయం, రైతులకు రసాయనిక ఎరువుల నుంచి విముక్తి, భూసార రక్షణకు అదనపు సాయం, సంస్కరణలు... రైతులకు సహాయంగా గోదాముల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు ఆర్థిక మంత్రి. నాబార్డ్ సాయం, పీపీపీ పద్ధతిలో ఎఫ్‌సీఐ, కేంద్ర గిడ్డంగుల సంస్థ సంయుక్తంగా గోదాముల నిర్మాణం చేపట్టునున్నట్లు తెలిపారు.
ధాన్యలక్ష్మి..
మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ధాన్యలక్ష్మి పథకం అమలు చేయనున్నట్లు తెలిపారు నిర్మలా. ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు నాబార్డు ద్వారా ఎస్‌ఎస్‌జీలకు సాయం అందిస్తామని, కూరగాయల సరఫరాకు కృషి ఉడాన్ యోజన, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ప్రత్యేక రవాణా సదుపాయం, కిసాన్ రైల్వే, కిసాన్ ఉడాన్ యోజన పథకాలు తీసుకురానున్నట్లు తెలిపారు. కూరగాయలు, పండ్లు, పూలు ఎగుమతులు, రవాణాకు ప్రత్యేక విమానాల వినియోగం, ఉద్యాన పంటల అభివృద్ధికి మరింత ప్రోత్సాహం, కేంద్ర, రాష్ట్రాలు కలిసి ఉద్యాన పంటలకు అదనపు నిధుల కేటాయింపులు చేయనున్నట్లు తెలిపారు.
వ్యవసాయానికి 2.83 లక్షల కోట్లు..
రానున్న ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.15 లక్షల కోట్లుగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఆల్గే, సీవీ కేజ్ కల్చర్ విధానంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధికి ప్రోత్సాహకాలు, 3,400 సాగర్‌మిత్రలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
2020-21 ఏడాదికి గాను గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాగునీరు, అనుబంధ రంగాలకు బడ్జెట్లో రూ.2.83 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.