కన్న పేగు తనను ఎందుకు వద్దనుకుందో కారణం తెలీదు. తనను అక్కడ ఎవరు సజీవ సమాధి చేశారో తెలీదు. కానీ బతకాలన్న ఆ పసికందు చేసిన పోరాటానికి మృత్యువు దాసోహమంది. తన ఉనికిని ప్రపంచానికి తెలియజేయాలని ఆ పసికందు చేసిన ఆర్తనాదం.. అటుగా పోతున్నవారి చెవిన పడింది. వారు ఆ పసివాడిని అక్కున చేర్చుకున్నారు. హృదయాలను ద్రవింపజేసే ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని సిద్ధార్థ్ నగర్ జిల్లా సోనౌరా గ్రామంలో చోటుచేసుకుంది.
సోనౌరా గ్రామంలో కొందరు గ్రామస్థులకు భవన నిర్మాణం జరుగుతున్న ప్రాంతం నుంచి పసికందు ఏడుపు వినిపించింది. దీనితో వారంతా ఏడుపు వినిపించిన ప్రదేశానికి చేరుకుని పరికించి చూడగా అక్కడ వారికి కాలు మాత్రం బయటకు కనపడుతూ మిగతా శరీర భాగం మట్టిలో కూరుకుపోయిన పసికందు కనబడింది. వెంటనే వారు జాగ్రత్తగా పసికందును బయటికి తీసి స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పసికందును శుభ్రం చేసి వైద్య పరీక్షలు నిర్వహించి పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతం పసికందు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కొద్దిగా మట్టి నోట్లోకి వెళ్లడంతో దాన్ని శుభ్రం చేసినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: దారుణం: కరోనా పోవాలని నరబలి!