సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీల విజయావకాశాలపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌పై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ఈ సర్వేలన్నీ వట్టి వదంతులని, ప్రజలు వాటిని నమ్మరని అన్నారు. ఈవీఎమ్‌లను తారుమారు చేసే కుట్రలో ఇది భాగమని ట్విట్టర్లో ఆరోపించారు.
"ఎగ్జిట్ పోల్స్ వదంతులను నేను నమ్మను. వీటి ద్వారా వేల సంఖ్యలోని ఈవీఎమ్‌లను తారుమారు చేయడానికి కుట్ర పన్నుతున్నారు. అన్ని విపక్షాలు బలంగా ఏకమవ్వాలని కోరుతున్నాను. మనం కలిసి బలంగా, ఐకమత్యంతో పోరాడదాం."
-మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి
బంగాల్లో విడుదలైన కొన్ని ఎగ్జిట్‌పోల్స్ తృణమూల్ కాంగ్రెస్‌కు 24 సీట్లు, భాజపాకు 16 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. కాంగ్రెస్ కేవలం 2 స్థానాలు దక్కించుకుంటుందని, వామపక్షాలకు తీవ్ర నిరాశ తప్పదని పేర్కొన్నాయి.
ఒమర్దీ అదే మాట...
తాజా ఎగ్జిట్‌పోల్స్‌పై జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
"ప్రతి ఎగ్జిట్‌పోల్ సర్వే తప్పుకాదు. టీవీలు ఆపేయాల్సిన సమయమిది. సామాజిక మాధ్యమాల నుంచీ బయటకురావాలి. 23న విడుదల అయ్యే ఎన్నిక ఫలితాల కోసం వేచిచూడండి."
-ఒమర్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత
ఏడు విడతల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో... భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ అధికారం చేజిక్కించుకుంటుందని అన్ని సర్వేలు తెలిపాయి. గెలిచే స్థానాల్లో చిన్నపాటి తేడాలున్నా... భాజపా గెలుపు ఖాయమని స్పష్టం చేశాయి.