ఐఎన్ఎస్ విరాట్‌ను రాజీవ్ గాంధీ ట్యాక్సీలా వాడారన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపణలను మాజీ నేవీ అధికారి ఐ.సీ రావు ఖండించారు. మోదీ వ్యాఖ్యలు అసత్యమని విశ్రాంత వైస్ అడ్మైరల్ రావు తెలిపారు. ప్రధాని స్థాయి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే... నిజం చెప్పినా ప్రజలు నమ్మరని ఆవేదన వ్యక్తం చేశారు.
"ఇలాంటి ఆరోపణల వల్ల మోదీ లాంటి వ్యక్తులు నిజాలు చెప్పినా అవి అబద్ధాల్లాగే కనపడతాయి. ఓట్ల కోసం రాజకీయ నేతలు ఇలాంటి ఆరోపణలు చేయడం ఎంతో బాధాకరం. ప్రజలు ఇలాంటి ఆరోపణలను పట్టించుకోకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి.'
- ఐ.సీ రావు, మాజీ నేవీ అధికారి.
1987 సమయంలో పది రోజుల పాటు లక్షద్వీప్‌లో బంధువులు, స్నేహితులతో విహారయాత్రకు వెళ్లినప్పుడు రాజీవ్ ఐఎన్ఎస్ విరాట్‌ను ట్యాక్సీలా వాడారని ప్రధాని మోదీ ఆరోపించారు. తాను మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి అభిమానిని కాదని స్పష్టం చేసిన రావు... నావికా దళం సహా ఇతర వ్యవస్థలను రాజకీయ లబ్ధికోసం ఉపయోగించడం సరికాదని అభిప్రాయపడ్డారు.
1987లో ముంబయి నావికా యార్డ్‌లో రావు ఆడ్మైరల్ సూపరిండెంట్ బాధ్యతలు నిర్వర్తించారు. ఆనాటి పరిస్థితులను మాజీ నేవీ అధికారి వివరించారు.
" తిరువనంతపురంలో రాజీవ్‌గాంధీ కుటుంబసమేతంగా నౌకలో ఎక్కారు. అక్కడి నుంచి లక్షద్వీప్ 220 నాటికల్ మైళ్ల దూరం. అక్కడికి చేరుకోవాలంటే హెలికాప్టర్ ఒక్కటే మార్గం. అందుకే విరాట్ నుంచి విమాన సేవలు వినియోగించుకున్నారు. నౌక సిబ్బందితో ఎంతో సరదాగా గడిపారు. వారికి భోజన వసతులూ ఏర్పాటు చేశారు రాజీవ్. అలాంటి వ్యక్తిపై కేవలం రాజకీయ లబ్ధికోసం తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు."
- ఐ.సీ రావు, మాజీ నేవీ అధికారి.
ఇదీ చూడండి: 'నిరూపించకుంటే మోదీ వంద గుంజీలు తీయాలి'