బిహార్‌లో ఈవీఎం యంత్రాలను హోటల్లో పెట్టిన ఓ ఎన్నికల అధికారిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ ఘటన సోమవారం ముజఫర్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఆ ఈవీఎంలను ఎన్నికలకు ఉపయోగించలేదని జిల్లా అధికారులు అనంతరం స్పష్టం చేశారు. ఆ అధికారికి నోటీసులు జారీ చేశారు.
గుర్తించిన మాహాకూటమి నేతలు...
సార్వత్రిక ఎన్నికల ఐదో విడతలో భాగంగా బిహార్‌లో సోమవారం పోలింగ్ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఎన్నికల సామాగ్రిని, 6 ఈవీఎంలను సెక్టార్ మెజిస్ట్రేట్ అవధేశ్ కుమార్ ఓ హోటల్లోకి తీసుకెళ్లడం స్థానిక మాహాకూటమి నేతలు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
రిగ్గింగ్ చేసి ఎన్డీఏకు సహకరించడానికే హోటల్లో ఈవీఎంలను ఉంచారని మహాకూటమి నేతలు ఆరోపించారు.
అవధేశ్ కుమార్‌తో పాటు ఆయనకి సహకరించిన ఐదుగురు పోలీసులపై చర్యలు చేపట్టే అవకాశముందని జిల్లా మెజిస్ట్రేట్ స్పష్టం చేశారు. ఈవీఎంల దుర్వినియోగం జరిగిందన్న వార్తలను ఖండించారు. హోటల్లో పెట్టిన ఈవీఎంలు రిజర్వులో ఉంచినవేనని స్పష్టం చేశారు.
నిబంధనల ప్రకారం ఎన్నికల సామాగ్రి, ఈవీఎంలను నిర్దేశించిన పోలింగ్ కేంద్రంలోనే ఉంచాలి.
ఇదీ చూడండి: ఆస్ట్రేలియా ప్రధానిపై గుడ్డుతో మహిళ దాడి