ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్. 'బాహుబలి' ప్రధాని.. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోలేక దేశ ప్రజలను దుఖంలోకి నెట్టేశారంటూ మండిపడ్డారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టి ఏడాది కాలం గడిచిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు సిబల్.
"లాక్డౌన్ సమయంలో ప్రజలు ఒకరికొకరు సాయం చేసుకున్నారు. మార్చి 24 తర్వాత ప్రభుత్వం.. తన విభజన ఎజెండాతోనే లాక్‌డౌన్‌ను అమలు చేసింది. ప్రభుత్వ ఎజెండా ప్రజలను విభజించటమే."
కపిల్ సిబల్, కాంగ్రెస్ సీనియర్ నేత.
ఎన్పీఆర్, సీఏఏ, యూఏపీఏ చట్టాల గురించి ఉదహరిస్తూ.. ఉగ్రవాదం నిర్మూలించటానికే యూఏపీఏ చట్టాన్ని తీసుకువచ్చినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. పార్లమెంట్లో చెప్పారని.. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
'కూలీల విషయంలోనూ వైఫల్యం...'
వలస కార్మికులు ఎన్నో అవస్థలు పడుతూ.. కాలి నడకన తమ సొంత రాష్ట్రాలకు వెళ్తున్నారని, కొందరైతే మార్గం మధ్యలోనే ప్రాణాలు విడుస్తున్నారని, ఇది ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు సిబల్. కూలీలను తరలించే విషయంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైందని ఆయన పేర్కొన్నారు.
'నేపాల్ భారత్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. మరోపక్క చైనాతోనూ ప్రతిష్టంభన కొనసాగుతోంది. మరి ప్రధాని మాత్రం వారికి ధీటైన సమాధానం చెప్పకుండా ఎందుకు మౌనంగా ఉన్నారో?' చెప్పాలి అని సిబల్ ప్రశ్నించారు. చైనా సరిహద్దు వద్ద ఏం జరుగుతోందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.