డిజిటల్ పాత్రికేయ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న ఈటీవీ భారత్.. మరో మైలురాయిని అందుకుంది. ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ బ్రాడ్‌కాస్టింగ్ కన్వెన్షన్-2019లో. 'కంటెంట్ ఎవ్రీవేర్' విభాగంలో నూతన ఆవిష్కరణ అవార్డును సొంతం చేసుకుంది. ఈటీవీ భారత్ తరఫున సాంకేతిక భాగస్వామిగా ఉన్న ఎవాకో ప్రతినిధి ఈ అవార్డును స్వీకరించారు. భారీ స్థాయిలో వార్తలు అందిస్తోందంటూ ఈటీవీ భారత్‌ను బ్రాడ్‌కాస్టింగ్ కన్వెన్షన్ కొనియాడింది.
పాత్రికేయ రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన ఈనాడు.. డిజిటల్ రంగంలో ఈటీవీ భారత్ పేరుతో అడుగుపెట్టింది. 2019 మార్చి 21న ప్రారంభమైన ఈటీవీ భారత్.. నాటి నుంచే డిజిటల్ రంగానికి దశ, దిశ చూపించి మార్గదర్శిగా మారిందంటే అతిశయోక్తి కాదు. విప్లవాత్మక రీతిలో.. న్యూస్‌రూమ్‌లు, రిపోర్టింగ్ కోసం బ్యూరోలను ఏర్పాటు చేసి డిజిటల్ వేదికపై సంచలనాలు సృష్టించింది.
దేశ వ్యాప్తంగా దాదాపు 5 వేల మంది మొబైల్ పాత్రికేయులు.. సమాచారాన్ని త్వరితగతిన, అదే సమయంలో నాణ్యతతో రాజీ పడకుండా వార్తా ప్రియులకు అందిస్తున్నారు. పత్రికా మాధ్యమం సహా దృశ్య మాధ్యమాలను కలగలపి ఈ యాప్‌ను రూపొందించారు.
ఈటీవీ భారత్.. తెలుగు సహా 12 ప్రధాన భారతీయ భాషల్లో పనిచేస్తోంది. హిందీ, ఉర్దూ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, పంజాబీ, ఒడియా, అస్సామీ, ఇంగ్లీష్ భాషల్లో.. దేశంలోని 28 రాష్ట్రాల్లో సేవలందిస్తోంది. డిజిటల్ రంగంలో.. నాణ్యతతో, ప్రతి అంశాన్ని నిష్పక్షపాతంగా స్పృశించే వేదికగా పేరు తెచ్చుకుంది. అంతర్జాతీయ అంశాలను మొదలుకుని జాతీయ, రాష్ట్ర, నియోజకవర్గాల వార్తలను సైతం వేగవంతంగా అందిస్తూ తనకు తానే సాటిగా నిలుస్తోంది. అన్ని భాషాల వార్తా విశేషాలను ప్రతి 5 నిమిషాలకు లైవ్ బులిటెన్ చొప్పున 24 గంటల పాటు అప్డేట్ చేస్తూ.. లేటెస్ట్ న్యూస్‌ను ఒకే యాప్‌లో అందిస్తోంది.
రాజకీయం, సామాజిక, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ప్రభుత్వ పాలన, గ్రామీణ, పట్టణ అభివృద్ది సహా ప్రత్యేకంగా నేర విభాగం, చిత్రమాలిక, వీడియోలు, వాణిజ్యం, క్రీడా విభాగాల్లో సమగ్ర సమాచారాన్ని ఒకే యాప్‌లో పొందుపరుస్తోంది. అవెకో, శరణ్యు టెక్నాలజీస్, రోబో సాఫ్ట్ టెక్నాలజీస్, హర్మోనిక్స్, విజువల్ టెక్నాలజీస్ వంటి సంస్థలు ఈటీవీ భారత్‌లో సాంకేతిక భాగస్వాములుగా ఉన్నాయి. 24 స్టూడియోల్లో 24 గంటల పాటు వార్తలను అందించడం ఈటీవీ భారత్ ప్రత్యేకత.
ఈటీవీ భారత్ మాతృసంస్థ ఈనాడు... తెలుగు పాత్రికేయ రంగంలో అత్యంత నమ్మకమైన సంస్థగా ప్రఖ్యాతి గాంచింది. ఈనాడు తర్వాత వచ్చిన ఈటీవీ సంస్థలో ఏడు తెలుగు ఛానళ్లు సహా పలు వినోదాత్మక ఛానళ్లు పనిచేస్తున్నాయి. ప్రామాణికతతో సహా నిష్పాక్షికమైన సమాచారాన్ని అందిచడం, ఆకర్షణీయమైన కార్యక్రమాలకు ఈ ఛానళ్లు ప్రసిద్ధిపొందాయి.