కేరళలోని ఎర్నాకులం ఎంపీ, కాంగ్రెస్ నేత హిబీ ఈడెన్ భార్య ఫేస్‌బుక్‌లో పెట్టిన ఓ పోస్ట్ వివాదాస్పదమైంది. పాత్రికేయురాలిగా పనిచేస్తోన్న అన్నా లిండా ఈడెన్... కొచ్చిలోని తన ఇంటి ముందు నిలిచిన వరదనీరు ఫొటోతో పాటు, తన భర్త ఐస్‌క్రీం తింటున్న వీడియోను సోమవారం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. దానికి క్యాప్షన్‌గా ‘‘విధి అత్యాచారం లాంటిది. ప్రతిఘటించలేకపోతే దాన్ని ఎంజాయ్ చేసేందుకు ప్రయత్నించాలి’’ అంటూ రాసుకొచ్చారు.

కొచ్చిలోని తన ఇంటి బయట వరదనీరు చుట్టుముట్టిన పరిస్థితిని సరదాగా చెబుతూ అన్వయించే ప్రయత్నంలో చేసిన ఈ పొరపాటు తీవ్ర వివాదాస్పదమైంది. ఆమె పోస్ట్‌పై సామాజిక మాధ్యమాల వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఓ వైపు అత్యాచారాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటాలు చేస్తుంటే.. ప్రముఖులు ఇలాంటి అంశాలపై జోకులు వేయడమేంటని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది చాలా సిగ్గుచేటు, అసహ్యకరమైనదనీ.. ఇందుకు ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ కామెంట్లు పెట్టారు.
‘‘మీరు పాత్రికేయులు. న్యాయ విద్యార్థిని. అంతేకాకుండా ఓ ప్రజాదరణ పొందిన వ్యక్తి. కొంచెం సిగ్గుపడండి’’ అంటూ చురకలంటించారు. స్పందించిన అన్నా లిండా ఈడెన్ మరో ఫేస్‌బుక్‌లో క్షమాపణలు చెబుతూ మరో పోస్ట్ చేశారు. అత్యాచార బాధిత మహిళల మనోభావాలను కించపరిచే ప్రయత్నం తాను చేయలేదని పేర్కొన్నారు. తాను వాడిన పదజాలానికి బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు.