అక్కడక్కడా విసిరేసినట్లుండే గ్రామాలు. ఎటుచూసినా కొండలు, గుట్టలు. అతి తక్కువ జనసాంద్రత. రవాణా వ్యవస్థ సరిగా ఉండదు. ఎక్కడికైనా వెళ్లాలంటే కిలోమీటర్ల కొద్దీ నడవాల్సిందే. ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌లో పరిస్థితి ఇది. అలాంటి ప్రాంతంలో ఇప్పుడు శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.
ఇదీ చూడండి:'సీవిజిల్' యాప్‌లో పాదరక్షలు
చైనా సరిహద్దులోని హయూలియాంగ్ నియోజకవర్గంలోని మాలోగం గ్రామంలో ఒకే ఒక్క ఓటర్ ఉన్నారు. ఆమె పేరు... సోకేలా త్యాంగ్. వయసు 39ఏళ్లు. అమూల్యమైన ఆమె ఓటు కోసం పోలింగ్ సిబ్బంది ఎంతో కష్టపడతారు. జిల్లా కేంద్రం అంజావ్ నుంచి 39 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రామానికి నడిచి వెళ్తారు. ఈ ప్రయాణానికే ఒక రోజు పడుతుంది.
'ఏకైక ఓటరు'
మాలోగం గ్రామంలో సోకేలాతో పాటు మరికొన్ని కుటుంబాలు ఉన్నాయి. కానీ... ఓటరు మాత్రం ఒక్కరే. కారణం... మిగిలినవారంతా ఇతర పోలింగ్ కేంద్రాల్లో ఓటు నమోదు చేసుకున్నారు.
2014 ఎన్నికల సమయంలో సోకేలా, ఆమె భర్త జానేలూమ్ త్యాంగ్ ఓట్లు మాలోగం పోలింగ్ స్టేషన్లో ఉండేవి. భర్త ప్రస్తుతం తన పేరును వేరే పోలింగ్ బూత్‌లో నమోదు చేసుకున్నారు. ఇక ఆ గ్రామంలో ఉన్న ఏకైక ఓటరు సోకేలానే.
సోకేలా త్యాంగ్ ఒక్కరే ఉన్న పోలింగ్ బూత్‌కు ఎన్నికల నిర్వహణకు సిబ్బంది అంతా వెళ్లాల్సిందే. ప్రిసైడింగ్ అధికారి, పోలింగ్ అధికారులు, భద్రతా సిబ్బంది 39 కిలో మీటర్లు కాలినడకనే వెళ్లాలి. ఎన్నికల రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ బూత్‌లోనే ఉండాలి. సోకేలా త్యాంగ్ ఎప్పుడు వచ్చి ఓటేస్తే అప్పుడే పూర్తవుతుంది. కానీ ఓటరును త్వరగా వచ్చి ఓటేయాలని బలవంత పెట్టరాదు.
అతి తక్కువ ఓటర్లు...
అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య మరీ తక్కువగా ఉంది. పక్కే కేస్సాంగ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని లమ్టా పోలింగ్ బూత్‌లో ఆరుగురు ఓటర్లు మాత్రమే ఉన్నారు. 2,202 పోలింగ్ స్టేషన్లున్న అరుణాచల్‌ప్రదేశ్‌లో 7 బూత్‌లలో ఓటర్ల సంఖ్య 10 కన్నా తక్కువే. 281 స్టేషన్లలో 100లోపు ఓటర్ల ఉన్నారు.
ఇవి మాలోగం కన్నా దూరం...
రాష్ట్రంలో మాలోగం లాంటి గ్రామాలు మరెన్నో ఉన్నాయి. 518 పోలింగ్ బూత్‌లలో 30-50 కిలోమీటర్లు నడిస్తేకానీ పోలింగ్ సిబ్బంది చేరుకోలేరు. అంటే దాదాపు 3 రోజులు నడవాలన్నమాట!
మహిళా ఓటర్ల కోసం ప్రత్యేకంగా...
అరుణాచల్‌ప్రదేశ్‌లో ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 7.94 లక్షలు. దాదాపు 4 లక్షల మంది మహిళా ఓటర్లు. రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం ఈసారి ప్రత్యేకంగా 11 పోలింగ్ స్టేషన్లను మహిళా ఓటర్ల కోసమే ఏర్పాటు చేసింది.
ఇదీ చూడండి:వారసుడి కోసం కన్నయ్యకు కళ్లెం!