"ద్విచక్ర వాహనదారుడికి రూ.30వేలు జరిమానా... ఆటో డ్రైవర్‌కు రూ.55వేలు ఫైన్... లారీ డ్రైవర్‌కు రూ.2లక్షలు చలానా!"... మోటరు వాహనాల కొత్త చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి వినిపిస్తున్న వార్తలు. భారీ జరిమానాలకు భయపడి కొందరు సొంత వాహనాలు వాడడం తగ్గించేశారు కూడా. ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించారు ఓ రాజకీయ నేత.
హరియాణా ఫతేహాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున పోటీచేస్తున్న దూదారామ్ బిష్ణోయ్... ఓటర్లకు ఓ విచిత్ర హామీ ఇచ్చారు. తనను గెలిపిస్తే... ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా చలానా రాకుండా చూస్తానని చెప్పారు.
"నన్ను మీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నుకోండి. మాదక ద్రవ్యాల కట్టడి, విద్య, ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ చలానాలు వంటి చిన్నచిన్న సమస్యలు రాకుండా చూసుకుంటా."
-దూదారామ్ బిష్ణోయ్, భాజపా అభ్యర్థి.
దూదారామ్ వ్యాఖ్యలు నెట్టింట్ వైరల్ అయ్యాయి. హరియాణాలోని 90 శాసనసభ నియోజకవర్గాలకు ఈనెల 21న పోలింగ్. 24న ఎన్నికల ఫలితం వెలువడనుంది.
ఇదీ చూడండి : కేంద్ర ఆర్థికమంత్రికి పీఎంసీ బాధితుల నిరసన సెగ