పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలి... దేశం మొత్తం చుట్టి రావాలి... రెండు విభిన్నమైన ఆలోచనలు... కానీ వీటి నుంచే వృద్ధ దంపతులు ఓ ఆలోచన చేశారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ద్విచక్రవాహనంపై తిరుగుతూ ప్రజలకు చెట్లు, నీటి సంరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం వీళ్లు జార్ఖండ్‌లోని కోడ్రమకు చేరుకున్నారు.
మోహన్‌లాల్ చౌహాన్ గుజరాత్ వడోదరకు చెందినవారు. దేశ పర్యటనకు వెళ్లాలనుకుంటున్నట్లు భార్య లీలా బెన్‌కు చెప్పారు. ఒక్కడినే పంపించటం ఇష్టం లేక ఆమె కూడా బయలుదేరారు. 1974 మోడల్ బులెట్‌పై ఫిబ్రవరి 10న ప్రయాణం ప్రారంభించారు. ఇప్పటివరకు 16వేల కిలోమీటర్ల ప్రయాణించారు.
అభిరుచి ఉంటే వయసుతో సంబంధం లేదు. వివిధ గ్రామాలను సందర్శించి రకరకాల ప్రజలను కలుస్తుంటాం. ఎక్కడికి వెళ్లినా... 15 నుంచి 20 మంది గుమిగూడుతారు. నీటిని సంరక్షించండి అని వారికి చెబుతుంటాం-
లీలా బెన్, మోహన్ లాల్ భార్య
ప్రభుత్వ రంగ సంస్థ 'ఓఎన్జీసీ'లో మోహన్‌లాల్ పనిచేశారు. గతంలో ఒకసారి గుండెపోటు వచ్చింది. తరవాత ఐదేళ్లు చీరల తయారీ వ్యాపారం చేశారు. అప్పుడు అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి కల్పించారు. అదే సమయంలో ఈయన దృష్టి సామాజిక సేవపై పడింది. తర్వాత జీవితంలో మార్పు కోరుకుంటూ వివిధ ప్రాంతాల్లో పర్యటించడం మొదటపెట్టారు.