లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆమె పని పట్ల నిత్యం అంకిత భావంతో ఉంటారని, తనను మందలించగల ఏకైక భాజపా నేత ఆమేనని చెప్పారు. మధ్యప్రదేశ్ ఇండోర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
"లోక్‌సభ స్పీకర్‌గా తాయ్(ఇండోర్‌లో సుమిత్ర ఈ పేరుతో ప్రసిద్ధి) విధులను ఎంతో నైపుణ్యంతో, ఓపికతో నిర్వర్తిస్తున్నారు. అందువల్లే ఆమె ప్రజల మనసులో చెరగని గొప్ప ముద్ర వేశారు. ప్రధానమంత్రిగానే నేను మీ అందరికీ తెలుసు. కానీ నన్ను మందలించగల వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది తాయ్(సుమిత్రా మహాజన్) మాత్రమే. ఇది పార్టీలోని అతికొద్ది మందికే తెలుసు" -- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
ఇండోర్ అభివృద్ధికి నాదీ భరోసా
ఇండోర్‌ను సుమిత్రా మహాజన్ ఎంతో అభివృద్ధి చేశారన్నారు ప్రధాని మోదీ. ఆమె చేయాలనుకొని మిగిలిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేసే భాధ్యతను తానే తీసుకుంటానని ప్రజలకు హామీ ఇచ్చారు.
" నేను, సుమిత్రా మహాజన్ భాజపాలో కలిసి పని చేశాం. ఆమె పని పట్ల ఎంత నిబద్ధతగా ఉంటారో నాకు తెలుసు. అంతే నిబద్ధతతో ఇండోర్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని మాటిస్తున్నా" -- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
పోటీ నుంచి నిష్క్రమణ
పార్టీ నిర్ణయం మేరకు తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని సుమిత్రా మహాజన్ గత నెల ప్రకటించారు. అయినా పార్టీ ప్రచారంలో పాల్గొంటున్నారు.
ఇండోర్ లోక్‌సభ స్థానానికి పార్టీ అభ్యర్థిగా శంకర్ లల్వాణీని ఎంపిక చేసింది భాజపా.
ఎనిమిదిసార్లు వరుసగా ఎంపీగా...
వరుసగా ఎనిమిదిసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు సుమిత్రా మహాజన్. ఈ ఘనత సాధించిన తొలి మహిళ ఆమె. 1989 నుంచి ఇండోర్ ఎంపీగా ఉన్నారు సుమిత్ర. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నారాయణ్ పటేల్‌పై 4,66,901 ఓట్ల మెజార్టీతో ఆమె ఘన విజయం సాధించారు. ఈసారి ఇండోర్ నుంచి భాజపా తరఫున శంకర్ లల్వాణీ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ నుంచి పంకజ్ సంఘ్వీ బరిలో ఉన్నారు.
సార్వత్రిక ఎన్నికల చివరి దశలో భాగంగా మే 19న ఇండోర్‌లో పోలింగ్ జరుగుతుంది.
ఇవీ చూడండి : ఘనంగా 'త్రిస్సూర్ పూరం' ఉత్సవాలు