ఉష్ణోగ్రతల పెరుగుదలతో భూమి వేడి గుప్పిట్లో చిక్కుకుంది. గడిచిన రెండు వేల ఏళ్లలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ఉష్ణోగ్రతలు 20వ శతాబ్దంలోనే నమోదవుతున్నాయి. కార్బన్ డై ఆక్సైడ్, ఇతర గ్రీన్హౌస్ వాయువులు ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమవుతున్నాయి. స్విట్జర్లాండ్‌లోని బెర్న్ విశ్వవిద్యాలయ పరిశోధకుల బృందం అధ్యయనం పలు అంశాలను వెల్లడించింది.
క్రీ.శ. 1300 నుంచి 1850 మధ్య కాలాన్ని అతిచిన్న మంచు యుగంగా పిలుస్తుంటారు. ఆ కాలంలో పుడమిపై ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యాయని చెప్తుంటారు. ఆ భావన సరికాదని బెర్న్ పరిశోధకులు తెలిపారు. అందుకు తగిన ఆధారాలు లేవన్నారు. కొన్ని చోట్ల మాత్రమే ఆ కాలంలో భూమి చల్లగా ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. క్రీ.శ 950-1250 మధ్య నాటి 'మిడీవల్ వార్మ్ పీరియడ్' భావనకీ ఇదే వర్తిస్తుందన్నారు. ఈ కాలంలో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనా.. అది కొన్ని ప్రాంతాలకే పరిమితమన్నారు.
అధ్యయనంలోని అంశాలు..
గడిచిన రెండు వేల ఏళ్లలో 20వ శతాబ్దం అత్యధిక వేడి శతాబ్దంగా తేలింది. తొలిసారిగా ప్రపంచమంతటా ఒకే తరహాలో ఉష్ణోగ్రతలు పెరుగుతూ పోతున్నాయి. 98 శాతం భూ ఉపరితలంపై మునుపటితో పోలిస్తే వేడి ఎక్కువగా ఉంటోంది. అగ్ని పర్వతాల విస్ఫోటం వంటి బాహ్య కారకాల ప్రభావం ఉష్ణోగ్రతల పెరుగుదలకు పెద్దగా కారణమవ్వట్లేదు. భూతాపం పెరుగుదల వేగం గతంలో ఎన్నడూ లేనంత అధికంగా ఉంది.
ఐరోపా కుతకుత..
చల్లని ప్రాంతాలుగా పేరున్న లండన్, పారిస్ సహా ఐరోపాలోని పలు నగరాలు ఎండల తీవ్రతకు కుతకుతలాడుతున్నాయి. పారిస్‌లో ఉష్ణోగ్రత గురువారం రికార్డు స్థాయిలో 40.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. లండన్‌లో 39, బెల్జియంలో 40 డిగ్రీల సెల్సియస్ పైన నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. జర్మనీ, ఆస్ట్రియా, నెదర్లాండ్స్ వంటి దేశాలూ వేడి తీవ్రతకు అల్లాడుతున్నాయి.
ఇదీ చూడండి: ఆపరేషన్ విజయ్: కార్గిల్ పరాక్రమానికి 20 ఏళ్లు