రాజస్థాన్, డుంగర్పుర్లో ఉపాధ్యాయుల నిరసనలు హింసాత్మకంగా మారాయి. 2018లో జనరల్ కోటాలో విడుదల చేసిన 1167 ఉపాధ్యాయ ఉద్యోగాల్లో షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు ఎస్టీ అభ్యర్థులు. గత రెండు రోజులుగా బిచివాడా జాతీయ రహదారి-8పై అల్లర్లకు పాల్పడుతున్నారు.
ఈ ఘటనలో ఇప్పటికే 7 ట్రక్కులు తగలబడ్డాయి. నిరసనకారుల దాడిలో ఓ హోటల్ తీవ్రంగా నష్టపోయింది. పోలీసులపై రాళ్ల వర్షం కురిసింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు బాష్పవాయువు, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు పోలీసులు.
పోలీసులకు గాయాలు..
శుక్రవారం హైవే-8పై ఆందోళనకారులను చెదరగొట్టారు పోలీసులు. అయితే, నిరసనకారులు పోలీసుల కళ్లుగప్పి పొలాలు, చెట్ల పొదల్లో నక్కారు. పోలీసులు లేని సమయం చూసి మళ్లీ రోడ్డెక్కారు. దీంతో బాంసవాడ, ఉదయపుర్, డుంగర్పుర్ మూడు జిల్లాల పోలీసులు రంగంలోకి దిగారు. హింసను అరికట్టేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్లు రువ్వారు నిరసనకారులు. ఈ ఘటనలో 100కు పైగా పోలీసులు గాయపడ్డారు.
హింసాత్మక నిరసనలను అదుపులోకి తెచ్చేందుకు జైపూర్ గ్రామీణ ఎస్పీ శంకర్ దత్ శర్మ బాధ్యతలు స్వీకరించారు.
గుంపులో గోవిందా...
శుక్రవారం ఆందోళనకారులు డుంగర్పుర్ లోని ఓ పెట్రోల్ బంకును ముట్టడి చేశారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీలు రంగంలోకి దిగారు. దీంతో పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఓ హైవే హోటల్లోకి చొరబడ్డారు ఆందోళనకారులు. గుంపులో గోవిందా అంటూ వారిలో కొందరు ఆ హోటల్ కౌంటర్ నుంచి నగదు, ఇతర సామగ్రని దోచుకెళ్లారు.
ఇదీ చదవండి: మధ్యప్రదేశ్లో వ్యాను- ట్రక్కు ఢీ.. ఐదుగురు దుర్మరణం