కరోనా బాధితుల్లో ప్లాస్మా చికిత్సకు సంబంధించి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) ఆమోదం తెలిపింది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) చేసిన ప్రతిపాదనకు ఈమేరకు పచ్చజెండా ఊపింది.
ట్రయల్స్ నిర్వహించేందుకు ఆసక్తి ఉన్న సంస్థల జాబితాను కేంద్ర ఔషధ ప్రమాణాలు, నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ)కు ఐసీఎంఆర్ అందించింది. ఐసీఎంఆర్‌తో కలిసి ఆ సంస్థలు ట్రయల్స్ నిర్వహించవచ్చని డీజీసీఐ స్పష్టం చేసింది.
"ఐసీఎంఆర్ ప్రతిపాదనను ఏప్రిల్ 13న జరిగిన నిపుణుల కమిటీ సమావేశంలో ఆమోదించాం. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో వేగంగా నిర్ణయం తీసుకున్నాం. క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు సీడీఎస్సీఓ నుంచి అభ్యంతరాలు ఉండకుండా నిబంధనలను సవరించాం."
- డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా
కరోనా బాధితులకు ప్లాస్మా చికిత్స ప్రక్రియకు సంబంధించి ఐసీఎంఆర్ స్పష్టమైన నిబంధనలను రూపొందించిందని డీజీసీఐ ప్రకటన తెలిపింది.
ప్లాస్మా థెరపీలో... కోలుకున్న రోగుల రక్తంలోని యాంటీబాడీలను సేకరించి కరోనాతో తీవ్రంగా బాధపడుతున్నవారిలో ప్రవేశపెట్టి చికిత్స అందిస్తారు.
ఇదీ చూడండి: కరోనా కట్టడికి టీబీ టీకా వాడకంపై పరిశోధనలు