కరోనాపై పోరాటంలో భాగంగా రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) సరికొత్త పరికరాన్ని రూపొందించింది. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా గదులను శుభ్రపరిచేందుకు రసాయన రహిత అతినీలలోహిత కిరణాల (యూవీ) క్రిమిసంహారక టవర్‌ను తయారు చేసింది.
దీనికి 'యూవీ బ్లాస్టర్' గా నామకరణం చేసింది రక్షణ మంత్రిత్వ శాఖ. దీనిని దిల్లీలోని డీఆర్డీఓకు చెందిన పరిశోధన కేంద్రం లేజర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ రూపొందించింది.
"12x12 చదరపు అడుగులు ఉన్న గదిని ఈ పరికరం 10 నిముషాలలో పూర్తిగా శానిటైజ్ చేస్తుంది. 400 చదరపు అడుగుల గదిని 30 నిమిషాల్లో శుభ్రం చేస్తుంది."
- రక్షణ శాఖ
ఈ పరికరం టవర్ ఆకారంలో ఉంటుంది. 254 నానోమీటర్ తరంగ ధైర్ఘ్యంతో పనిచేసే 43 వాట్ల యూవీ-సీ బల్బులు ఆరు ఇందులో ఉంటాయి. 360 డిగ్రీల కాంతి ప్రసారితం అవుతుంది. ఈ టవర్‌ను మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా రిమోట్‌తో ఆపరేట్ చేయవచ్చు.
"ఆఫీసులు, ల్యాబొరేటరీలు ఎలక్ట్రానిక్ పరికరాలు ఉండే ఆఫీసులు, పరిశోధనశాలల్లో ఇది ఉపయోగకరంగా ఉంటుంది. జనసాంద్రత ఎక్కువగా ఉండే విమానాశ్రయాలు, షాపింగ్ మాళ్లు, మెట్రో స్టేషన్లు, హోటళ్లు, కర్మాగారాలను ఈ యూవీ బ్లాస్టర్‌తో శానిటైజ్ చేయవచ్చు."
- రక్షణ శాఖ