కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భారత్ అమలు చేస్తున్న విధానాలపై అమెరికాలో భారత సంతతి వైద్యురాలు ఉమా మధుసూదన ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా కరోనా కట్టడిలో చక్కగా పని చేస్తున్నారని కితాబిచ్చారు.
అమెరికాలోని సౌత్ విండ్సర్ ఆసుపత్రిలో వైద్యురాలిగా పని చేస్తూ అసమాన సేవాభావం చూపిన ఉమా మధుసూదన పనితీరుకు మెచ్చి అక్కడి ప్రజలు ఆమెకు ఇటీవల రెండు వందల కార్లతో సెల్యూట్ చేశారు.
కరోనా రోగులకు తాను అలుపెరగని సేవలు అందించడంలో తన కుటుంబ సభ్యుల తోడ్పాటు ఎంతో ఉందని చెప్పారు ఉమ.
"కొవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడానికి భారత్ సిద్ధమైన తీరు పట్ల నాకు గర్వంగా ఉంది. ఇప్పటి వరకు భారత్‌లో లాక్‌డౌన్, భౌతిక దూరం, మాస్కులు ధరించడం, నిబంధనలను పాటించడం, శుభ్రత పాటించడం వంటి చర్యలను చక్కగా పాటిస్తున్నారు. ప్రభుత్వం మాత్రమే పని చేయడం కాకుండా ప్రజలు నిబంధనలు పాటించడం వంటి చర్యల ద్వారా మాత్రమే కరోనా మహమ్మారిపై యుద్ధాన్ని గెలవగలం.
కరోనాను ఎదుర్కోవడంలో ఆరోగ్య నిపుణులుగా పని చేయడం సులభం కాదు. ఈ విషయంలో వీరికి భద్రత ముఖ్యం. ఇతరులను కాపాడాలంటే వైద్య నిపుణులు తమను తాము కాపాడుకోవాలి. చేతులను శుభ్రపర్చుకోవడం, ముఖాన్ని కప్పుకోవడం, భౌతిక దూరం పాటించడం సహా మానసిక భావోద్వేగాలను నియంత్రించుకోవడం కూడా చాలా ముఖ్యం."
-ఉమా మధుసూదన, భారతీయ అమెరికన్ వైద్యురాలు
ఇదీ చూడండి: ముక్కుకు బదులు కళ్లకు మాస్క్- దేశాధ్యక్షుడిపై జనం సెటైర్