ఉల్లి ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్తున్న తరుణంలో ఇటీవలే ఎగుమతులపై నిషేధం విధించింది కేంద్ర ప్రభుత్వం. అయితే మోదీ సర్కారు నిర్ణయం బంగ్లా ప్రధాని షేక్ హసీనాపైనా ప్రభావం చూపింది. భారత సర్కారు నిర్ణయంతో తన వంటకాల్లో ఉల్లిని వినియోగించకూడదని వంట మనిషికి చెప్పానన్నారు హసీనా. ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న ఆమె దిల్లీలో జరిగిన భారత్-బంగ్లాదేశ్ వాణిజ్య సదస్సులో పాల్గొన్నారు. బంగ్లా ప్రధానంగా భారత్ ఉల్లి ఎగుమతులపైనే ఆధారపడినందున కేంద్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు తమకు సమాచారం అందిస్తే బాగుంటుందని చెప్పారు హసీనా.
" ఉల్లి ఎగుమతులను భారత్ ఎందుకు నిలిపివేసిందో నాకు తెలియదు. ఈ నిర్ణయం తర్వాత వంటలో ఉల్లి ఉపయోగించరాదని మా వంట వ్యక్తికి చెప్పాను. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు మాకు సమాచారం అందిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఉన్నట్లుండి ఎగుమతులను ఆపేసినందున మా దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భవిష్యత్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే.. మాకు ముందస్తు సమాచారం అందించి సహకరించండి."
- షేక్ హసీనా, బంగ్లాదేశ్ ప్రధాని