కరోనా వైరస్ను తేలికగా తీసుకోవద్దని దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభ్యర్థించారు. కరోనాకు వ్యాక్సిన్ కనుగొనేంత వరకు మాస్కులు ధరించడం, భౌతిక దూరం వంటి నిబంధనలు కచ్చితంగా పాటించాలని కోరారు.
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనను ప్రారంభించిన అనంతరం ప్రజలనుద్దేశించిన చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు మోదీ.
"మాస్కులు ధరించండి, రెండు గజాల భౌతిక దూరాన్ని పాటించండి. ఇదే మీ నుంచి నేను ఆశిస్తున్నది. భద్రంగా ఉండండి.. ఆరోగ్యంగా ఉండండి. కుటుంబంలోని వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి. ఇవి ఎంతో ముఖ్యమైనవి. కరోనాను తేలికగా తీసుకోవద్దు. శాస్త్రవేత్తలు కరోనాకు టీకా అభివృద్ధి చేసేంతవరకు ఇవే మనల్ని కాపాడతాయి. ఇదే ఏకైక పరిష్కారం."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
'అసాధారణ సవాలే.. కానీ'
కరోనా వైరస్ను అసాధారణమైన సవాలుగా అభివర్ణించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అయినప్పటికీ... ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఆ సవాలును ఎదుర్కొంటోందని వెల్లడించారు. తమ శ్రమను ప్రపంచ దేశాలు గుర్తించాయని పేర్కొన్నారు.
తన సొంత నియోజకవర్గం గాంధీనగర్లో పలు అభివృద్ధి కార్యకలాపాలకు శంకుస్థాపన చేసిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు హోంమంత్రి.
దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఒక్కరోజే 95,735 కేసులు వెలుగుచూశాయి. మరో 1,172 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 44 లక్షల 65 వేల 864కు పెరిగింది.
ఇదీ చూడండి:- విపరీతమైన తలనొప్పి.. మైగ్రేనా లేక కరోనానా?