ప్రాణాంతక కరోనా వైరస్‌తో చైనాలో కన్నుమూసిన తన తల్లి మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేలా చూడాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించాడు ముంబయికి చెందిన పునీత్ మెహ్రా అనే వైద్యుడు. వీలైనంత త్వరగా తన తల్లి 'రీటా రజిందర్ మెహ్రా' భౌతికకాయాన్ని తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు కేంద్ర విదేశాంగ శాఖ, బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయానికి లేఖ రాశాడు.
"ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఉత్తరం రాశాను. నా తల్లి పార్థివదేహాన్ని ముంబయికి తీసుకొచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తే.. వీలైనంత త్వరగా మా అమ్మ అంతిమ సంస్కారాలు నిర్వహించుకుంటాం. 24 రోజులు గడిచినప్పటికీ అమ్మ మృతదేహాన్ని ఇంటికి తీసుకురాలేకపోతున్నందుకు మా కుటుంబం మొత్తం ఎంతో మానసిక క్షోభకు గురవుతోంది."
- పునీత్ మెహ్రా, వైద్యుడు
రీటా రజిందర్ మెహ్రా అనే మహిళ జనవరి 24న మరణించింది. అప్పటి నుంచి పార్థివ దేహన్ని చైనాలోని ఓ ఆసుపత్రి శవపరీక్ష గదిలో ఉంచారు. కరోనా కారణంగా చైనాలో వాహనాలపై పరిమితులు విధించడం వల్ల మృతదేహాన్ని పంపించడంలో ఆలస్యమవుతోందని.. బీజింగ్‌లోని రాయబార కార్యాలయం.. రీటా తనయుడు పునిత్ మెహ్రాకు సమాచారమిచ్చింది. వార్త వినగానే నిరాశ చెందిన అతడు.. కేంద్ర ప్రభుత్వ సాయాన్ని కోరాడు. తల్లి అంత్యక్రియలు స్వదేశంలో చేయాలని భావిస్తున్నట్లు వివరించాడు.
అసలేం జరిగింది...
పునీత్ తన తల్లి రీటాతో కలిసి జనవరి 24న బీజింగ్ నుంచి ముంబయికి బయలుదేరాడు. విమానం టేకాఫ్ అయిన 9 గంటల తర్వాత రీటా బాత్రూమ్కి వెళ్లింది. ఎంతసేపటికీ తిరిగిరాకపోవడం వల్ల కంగారు పడిన పునీత్.. విమాన సిబ్బందిని అప్రమత్తం చేశాడు. వెంటనే తలుపులు తెరిచి చూడగా..మెహ్రా తల్లి స్పృహ తప్పి పడి ఉంది. అనంతరం సమీప విమానాశ్రయంలో ఆ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేయగా.. అప్పటికే మహిళ మరణించింది.
ఆ తర్వాత ఫిబ్రవరి 7న పునీత్ ముంబయికి తిరిగి వచ్చాడు. కానీ తన తల్లి మృతదేహాం అక్కడే ఉండిపోయింది.