తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వాన్ని ముమ్మరం చేసింది ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే. ఎన్నికలకు ఇంకా కొద్ది నెలలే మిగిలి ఉన్న నేపథ్యంలో అధికార పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా 'వీ రిజెక్ట్ ఏడీఎంకే' పేరుతో ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వ్యవసాయం, విద్య, నిరుద్యోగం వంటి విషయాల్లో పళనిస్వామి ప్రభుత్వం విఫలమైందని, తమిళనాడు ప్రజలందరూ కలిసి ఏఐఏడీఎంకేను ఓడించాలని పిలుపునిస్తూ వీడియోను విడుదల చేసింది డీఎంకే.
ఏఐఏడీఎంకే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పార్టీ నేతలంతా తమిళనాడులోని 16వేల గ్రామాలు, వార్డులలో గ్రామ సభలు నిర్వహించాలని డీఎంకే విడుదల చేసిన వీడియోలో సూచించారు స్టాలిన్ . వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 200 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
2011నుంచి ప్రతిపక్షానికే పరిమితమైన డీఎంకే.. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే కృత నిశ్చయంతో ఉంది. నీట్, రైతు సమస్యలు, నిరుద్యోగం, శాంతిభద్రతలు వంటి అంశాలపై ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా దృష్టి సారించింది.
ఇదీ చూడండి: 'ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. బంగారు బంగాల్ నిర్మిస్తాం'