ఇవీచూడండి:
గడ్కరీ వ్యక్తిత్వం X భాజపాపై వ్యతిరేకత!
భారత్ భేరి: ఓటేస్తే సగం ధరకే ఆలూ బోండా
తమిళనాడులోని 39 లోక్సభ నియోజకవర్గాలకు ఏప్రిల్ 18న ఎన్నికలు. వాటితో పాటు అదే రోజున 18 శాసనసభ స్థానాలకు ఉపఎన్నికలు. లోక్సభ ఎన్నికలు... దిల్లీలో చక్రం తిప్పేందుకు వచ్చిన అవకాశం. శాసనసభ ఉపఎన్నికలు... చెన్నై పీఠాన్ని చేజిక్కించుకునేందుకు ఉన్న మార్గం.
హస్తినలో పునర్ వైభవం కోసం...
కరుణానిధి నేతృత్వంలో ఒకప్పుడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది డీఎంకే. 1989లో ఈ పార్టీ తొలిసారి కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో కేబినెట్ బెర్తు సొంతం చేసుకుంది. అనంతరం 1996 యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలోనూ అదే పాత్ర పోషించింది. వాజ్పేయూ నేతృత్వంలోని ఎన్డీఏ పాలనలో.. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలోని యూపీఏ హయాంలోనూ డీఎంకే కేబినెట్లో ఒక భాగంగా ఉంది.
తమిళుల రక్షకుడు....
తమిళుల ప్రయోజనాలు ముఖ్యమన్నదే డీఎంకే విధానం. అందుకే 2009లో ఎల్టీటీఈపై దాడి చేస్తున్న శ్రీలంక సైన్యానికి వ్యతిరేకంగా కరుణానిధి 6 గంటలపాటు నిరాహార దీక్ష చేశారు కరుణానిధి. వెంటనే... యూపీఏ ప్రభుత్వం శ్రీలంకపై ఒత్తిడి తెచ్చి దాడులు తాత్కాలికంగా ఆగేలా చేసింది. ఇదంతా తమ విజయమేనని ప్రచారం చేసుకుంది డీఎంకే.
అనూహ్యంగా... 2009 లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే... మే 17, 18 తేదీల్లో శ్రీలంక సైన్యం విజృంభించింది. ఎల్టీటీఈపై విరుచుకుపడింది. నరమేధం తీవ్రరూపం దాల్చింది. ఫలితంగా.. కరుణానిధి తమిళుల రక్షకుడు అనే ముద్రను పోగొట్టుకున్నారు. 2జీ కుంభకోణంలో ఆరోపణలతో 2011 అసెంబ్లీ, 2014 లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాభవాన్ని చవిచూసింది.
2019 ఎన్నికలకు ముందు మరోమారు తమిళ నినాదాన్ని నమ్ముకుంది డీఎంకే. కావేరి జలవివాదం, హిందీ భాష బలవంతంగా రుద్దడం, నీట్ వంటి అంశాలు ప్రస్తావిస్తూ... కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాను తమిళ వ్యతిరేకిగా చూపే ప్రయత్నం చేస్తోంది. జాతీయస్థాయిలో మద్దతు కోసం కాంగ్రెస్తో జట్టుకట్టింది. తమిళనాడులో 9 సీట్లు, పుదుచ్చేరి లోక్సభ స్థానాన్ని మిత్రపక్షానికి కేటాయించింది.
తమిళనాడులో డీఎంకే 20 లోక్సభ స్థానాల్లోనే బరిలోకి దిగింది. పార్టీ బలంగా ఉన్న చోటే పోటీ చేస్తూ విజయావకాశాలను మెరుగుపర్చుకునే ప్రయత్నం చేస్తోంది.
లక్ష్యం 13...
లోక్సభ ఎన్నికలు ప్రధానమైనా... డీఎంకే దృష్టంతా ఉపఎన్నికలపైనే. అన్నాడీఎంకేలో నాటకీయ పరిణామాలతో 16మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. డీఎంకే సభ్యుడి మృతితో తిరువారూర్ స్థానం ఖాళీ అయింది. దశాబ్దాల నాటి ఓ కేసులో శిక్షతో... హోసూర్ నుంచి గెలిచిన మంత్రి బాలకృష్ణారెడ్డి శాసనసభ సభ్యత్వం కోల్పోయారు. ఇప్పుడు ఈ 18 స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి.
తమిళనాడు శాసనసభలో మొత్తం సీట్ల సంఖ్య 235. ప్రస్తుతం 22 ఖాళీలున్నాయి. మిగిలినవాటిలో అన్నాడీఎంకే బలం 113. డీఎంకేకు 88, కాంగ్రెస్కు 8మంది సభ్యులు ఉన్నారు. మిగిలినవి చిన్నపార్టీల సభ్యులు, ఇతరులు. ఇప్పుడు 18 శాసనసభ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. ఇందులో కనీసం 13 స్థానాలు గెలవాలన్నది డీఎంకే లక్ష్యం. అప్పుడు కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే వీలుంటుంది. ఇలా దిల్లీ, చెన్నైలో ఒకేసారి సత్తా చాటే లక్ష్యంతో స్టాలిన్ సేన అనుసరిస్తున్న ద్విముఖ వ్యూహం ఏమేరకు ఫలిస్తుందో వేచిచూడాలి.
ఇవీ చూడండి: