నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ(ఎన్సీపీ) నేత ఫరూక్ అబ్దుల్లా ఇష్టపూర్వకంగానే తన నివాసంలో ఉన్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో వ్యాఖ్యానించారు. ఇది జరిగిన కొద్ది సేపటికే జమ్ముకశ్మీర్‌లోని తన నివాసం వద్ద ఫరూక్ అబ్దుల్లా భావోద్వేగ ప్రకటన చేశారు. తనను ప్రభుత్వం నిర్బంధించిందని.. ఇంటి తలుపులను బద్దలుకొట్టుకుని మీడియాతో మాట్లాడటానికి వచ్చినట్టు వివరించారు. కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్ ప్రజలను వెన్నుపోటు పొడిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.
"నా రాష్ట్రం అట్టుడుకుతున్న వేళ.. ప్రజలను జైళ్లల్లో చంపుతుంటే.. ఇళ్లల్లో చిత్రహింసలు పెడుతుంటే.. నేను ప్రశాంతంగా ఇంట్లో కూర్చుంటానా? నేను విశ్వసించిన భారత్ ఇది కాదు. నేను కోరిన ప్రజాస్వామ్య దేశం ఇది కాదు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఈ రాష్ట్ర ప్రజలను కేంద్రం వెన్నుపోటు పొడిచింది. బయటకు వచ్చాక మేము ఈ విషయంపై పోరాటం చేస్తాం. నా కొడుకు(ఒమర్ అబ్దుల్లా) జైల్లో ఉన్నాడు. ఇంకెంత మంది అమాయకులు జైలుకు వెళ్తారో నాకు తెలియదు."
--- ఫరూక్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత.
తన ఇంటి ఎదుట డీసీపీని మోహరించి.. తనను నిర్బంధించలేదని అమిత్ షా ఎలా అనగలుగుతారని ఫరూక్ ప్రశ్నించారు.
ఇదీ చూడండి:- లైవ్ వీడియో: బైకర్ నిర్లక్ష్యానికి ఇద్దరు బలి