దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కేంద్ర ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేశారు. మే 17 తరువాత లాక్డౌన్ నుంచి కొన్ని సడలింపులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
సోమవారం నుంచి...
లాక్డౌన్ సడలింపుపై కేంద్రం తీసుకున్న నిర్ణయాల ఆధారంగా... సోమవారం నుంచి దిల్లీలో వివిధ ఆర్థిక కార్యకలాపాలను అనుమతించనున్నట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు.
ఆన్లైన్ మీడియా సమావేశంలో మాట్లాడిన కేజ్రీవాల్... ప్రజల నుంచి తనకు మంచి సూచనలు వస్తున్నాయని పేర్కొన్నారు. మే 17 తరువాత కూడా విద్యాసంస్థలు, స్పా, స్విమ్మింగ్ పూల్స్, మాల్స్ తెరవద్దని ప్రజలు సూచిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే మెట్రో సర్వీసులను కూడా పరిమితంగా అనుమతించాలని ప్రజలు కోరుతున్నట్టు వివరించారు.
"మాకు మార్కెట్ అసోసియేషన్ల నుంచి కూడా పలు సలహాలు వచ్చాయి. ఎక్కువ మంది సరి-బేసి ప్రాతిపాదికన మార్కెట్లను ప్రారంభించాలని సూచించారు."
- అరవింద్ కేజ్రివాల్, దిల్లీ ముఖ్యమంత్రి
చాలా కష్టపడాలి..
లాక్డౌన్ వల్ల స్తంభించిన ఆర్థిక వ్యవస్థకు తిరిగి పునరుత్తేజం అందించడానికి తాము చాలా కష్టపడాల్సి ఉంటుందని కేజ్రివాల్ తెలిపారు.
ఇదీ చూడండి: ప్రభుత్వ ఉద్యోగులకూ వర్క్ ఫ్రం హోమ్!