మహారాష్ట్ర షిరిడీ సాయిబాబా ఆలయానికి భక్తులు పోటెత్తారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం ఆలయాన్ని మూసేస్తారని ప్రకటించడమే ఈ తాకిడికి కారణం. చివరి హారతికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. బాబా నామస్మరణతో ఆలయం మార్మోగిపోయింది.
కరోనా వైరస్ ప్రభావంతో షిరిడీ ఆలయాన్ని మూసివేయాలని నిర్ణయించారు అధికారులు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు ఉదయం వెల్లడించారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు భక్తులు తమ ప్రయాణాలను తాత్కాలికంగా రద్దు చేసుకోవాలని సూచించారు.
దేశంలో ఇప్పటికే 125కిపైగా కరోనా కేసులు నమోదుకాగా మహారాష్ట్రలో తీవ్రత అధికంగా ఉంది. అక్కడ ఇప్పటికే 39 కరోనా కేసులు నిర్ధరణ అయ్యాయి. అత్యధిక రద్దీ ప్రాంతాలు, ఆలయాల్లో కూడా ప్రజలు సమూహాలుగా ఏర్పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ముంబయిలో ప్రఖ్యాత సిద్ధి వినాయక ఆలయం సహా మరికొన్ని ఆలయాలను మూసివేశారు.
- ఇదీ చూడండి: ఆమె హస్తకళా నైపుణ్యానికి విజయం దాసోహం