మహారాష్ట్రలో 'ఆపరేషన్ కమలం' ప్రక్రియ కొనసాగడం లేదని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్ అన్నారు. అంతర్గత కలహాలతో మహా వికాస్ అఘాడి ప్రభుత్వం దానంతట అదే కూలిపోతుందని జోస్యం చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశం ముగిశాక ఆయన ఇలా వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో చక్కెర పరిశ్రమకు ఆర్థిక సాయం అందించాలని కోరేందుకే అమిత్‌షాతో సమావేశం అయ్యానని ఫడణవిస్ తెలిపారు. రాజకీయ అంశాలేవీ మాట్లాడలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ జోక్యం చేసుకోవాలని కోరానని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఆసక్తి తమకు లేదన్నారు. ఇది వైరస్‌పై పోరాడాల్సిన సమయమని వెల్లడించారు.
'ఆపరేషన్ కమలంపై ఆసక్తి లేదు. ప్రభుత్వంలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయని మేం ఇప్పటికే చెప్పాం. కలహాలతో రాష్ట్ర ప్రభుత్వం కూలిపోవడం మనం చూస్తాం' అని ఫడణవిస్ అన్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నట్టు వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారేశారు. మహారాష్ట్ర పశ్చిమ ప్రాంత నేతలు తనతో దిల్లీకి రావడంపై ప్రశ్నించగా.. వారందరికీ చక్కెర పరిశ్రమతో సంబంధం ఉందని జవాబిచ్చారు.
ఇదీ చూడండి:మాస్క్ ఉంటేనే ప్రయాణం.. లేదంటే నడకే!