పేదరికం కారణంగా బంగారు భవిష్యత్ కోల్పోతున్న ఎందరో పిల్లలకు ఓ దారి చూపాలన్న సందీప్ ఆశయం నుంచి పుట్టింది ఈ ఆలోచన. విద్యా దానాన్ని మించినదానం లేదని విశ్వసించిన మరింత మంది... స్వచ్ఛందంగా పాఠాలు చెప్పేందుకు తరలివచ్చారు. గొప్ప కార్యానికి మెచ్చి ఎందరో దాతలు తోచినంత సాయాన్ని అందించారు.
ఇప్పుడు గురుగ్రామ్‌లో ఇలాంటి మొబైల్ పాఠశాలలు ఐదు ఉన్నాయి. ఒక్కో బస్సులో 60 మంది విద్యార్థులు కూర్చుని, పాఠాలు వినేలా బల్లలు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు నడిచే ఈ బడిలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి లోపున్న బాలబాలికలు.. దాదాపు 300 మంది ఉన్నారు. పిల్లలకు కావలసిన పాఠ్యపుస్తకాలు, ఏకరూపు దుస్తులు వంటివి సంచార పాఠశాల నిర్వాహకులు అందజేస్తారు.
"ఈ సామాజిక కార్యక్రమం ప్రారంభించే ముందు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. పిల్లలకు దుస్తులు, భోజనం, పుస్తకాలు వంటివి ఇవ్వాలి. కానీ... అవన్నీ నేనొక్కడినే చేయలేను. ఇలాంటి ఆలోచనలున్న ఎంతో మంది నాకు సహాయపడ్డారు. దగ్గర్లోని సోసైటీలో ఉండే వారు కొందరు పుస్తకాలు, దుస్తులు ఇచ్చి వెళ్తారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేసిన గీత వంటివారు పిల్లలకు విద్య బోధిస్తున్నారు."
-సందీప్ రాజ్‌పుత్, సంచార పాఠశాలల నిర్వాహకుడు
ఫీజు భారాలు, రవాణా ఖర్చులు లేకుండానే తమ పిల్లలు చదువుకుంటున్నందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందపడుతున్నారు.