దేశంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్ సహా పలు ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా కొవిడ్-19 అనుమానితులు, విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులను 14 రోజులు క్వారంటైన్లో ఉంచాలని సూచించింది. ఆ నిబంధనల్ని ఆయా రాష్ట్రాలు పటిష్ఠంగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఉల్లంఘనుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ఈ తరహా కేసులు తమిళనాడులో రెండు నమోదయ్యాయి.
అర్ధనగ్నంగా రోడ్డు మీదకు..
తమిళనాడులోని తేని ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవలే శ్రీలంక వెళ్లొచ్చాడు. అతడికి హోమ్ క్వారంటైన్ వేసి ఇంట్లోనే ఉండాలని సూచించారు ఆ రాష్ట్ర అధికారులు. ఇంట్లో ఉన్న అతడిని చుట్టుపక్కల ఉన్నవాళ్లు కరోనా సోకిన వ్యక్తిగా పదేపదే పిలవడం వల్ల తీవ్రంగా కలత చెందాడు. మానసిక ఒత్తిడి తట్టుకోలేక అర్ధనగ్నంగా వీధుల్లో పరుగెత్తుకుంటూ వెళ్లి.. ఓ మహిళ మెడను కొరికేశాడు. ఈ సంఘటనతో ఉలిక్కిపడిన గ్రామస్థులు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అతడిపై కేసు నమోదైంది. గాయపడిన మహిళకు తేని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు.
ప్రియురాలి కోసం పారిపోయి..
కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు విదేశాల నుంచి వచ్చే వారికి.. 14 రోజులు ఇళ్లలోనే ఉండాలని హోమ్ క్వారంటైన్ స్టాంపులు వేస్తున్నారు. ఎవరిలోనైనా కొన్ని లక్షణాలు కనిపిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలకు తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా మధురై విమానాశ్రయంలో తనిఖీలు చేసి.. దుబాయ్ నుంచి వచ్చిన 24 ఏళ్ల యువకుడిని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. చికిత్సలో ఉన్న అతడు.. శివగంగ జిల్లాలో ఉన్న ప్రియురాలిని కలిసేందుకు ఆ కేంద్రం నుంచి తప్పించుకొని పారిపోయాడు. పోలీసులు, వైద్య సిబ్బంది అతడి కోసం ఉరుకులు పరుగులు పెట్టారు. చివరికి అతడిని తన ప్రియురాలి ఇంట్లో గుర్తించారు. క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి.. అరెస్టు చేశారు. ప్రియురాలు సహా ఇద్దర్నీ క్వారంటైన్‌కు తరలించారు.
తమ ప్రేమకు ప్రియురాలి తల్లిదండ్రులు అంగీకరించకపోవడం వల్లే రహస్యంగా ఆమెను కలవాల్సి వచ్చిందని, అందుకోసమే పారిపోయినట్లు విచారణలో పోలీసులకు వెల్లడించాడు ఆ యువకుడు.
ఇదీ చూడండి...