తమిళనాడు అన్నా విశ్వవిద్యాలయంలో ప్రవేశపెట్టిన సంస్కృతం, భగవద్గీత అంశాలను ఇంజినీరింగ్ విద్యావిధానంలో నుంచి తీసేయాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని.. డీఎంకే(ద్రవిడ మున్నేట్ర కళగం) విద్యార్థి విభాగం చెన్నైలో నిరసన ప్రదర్శనలు చేపట్టింది.
కేంద్ర ప్రభుత్వం సంస్కృతాన్ని తమపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తోందని.. సిలబస్ నుంచి భగవద్గీతను తొలగించే వరకు తమ నిరసనలు ఆగవని హెచ్చరించారు విద్యార్థి విభాగం నేతలు. ఇంజినీరింగ్ విద్యార్థికి ఇది అవసరం లేదన్నారు.
మాతృభాషకై గళం వినిపించాలి..
భగవద్గీత, సంస్కృత భాషలను విద్యార్థులపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని... అన్నా యూనివర్సిటీ యాజమాన్యంపై మండిపడ్డారు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలను మానుకోవాలని హితవు పలికారు. ప్రతి రాష్ట్రం తమ మాతృభాష కోసం గళమెత్తాలని కోరారు.
ఇదీ వివాదం...
బీటెక్ 3వ సెమిస్టర్లో భగవద్గీతను ఓ సబ్జెక్ట్గా చేర్చుతూ అన్నా విశ్వవిద్యాలయం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం రేగింది. వెంటనే వర్సిటీ యాజమాన్యం దిద్దుబాటు చర్యలకు దిగింది. భగవద్గీత, సంస్కృతం తప్పనిసరి కాదని... ఏఐసీటీఐ నిర్దేశించిన 12 సబ్జెక్టుల్లో విద్యార్థులు తమకు నచ్చినది ఎంచుకోవచ్చని ఉపకులపతి సూరప్ప స్పష్టంచేశారు.
ఇదీ చూడండి: ఇంజినీరింగ్ విద్యలో సంస్కృత భాష!