ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా వృథా కాకూడదని ఆకాంక్షించారు దిల్లీ ఎన్నికల్లో ఓటు వేయనున్న అత్యధిక వయస్కులైన ఓటరు బచ్చన్ సింగ్. ఆయనకు 111ఏళ్లు. నేడు జరిగే పోలింగ్‌లో ఆయన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఎన్నికల సంఘం అధికారులు ఇంటికొచ్చి మరీ బచ్చన్‌ను ఓటు వేయాలంటూ ఆహ్వానించారు. ఆయనను ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి, అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఎన్నికల సంఘం అధికారులు ఇంటికి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు బచ్చన్ సింగ్ కోడలు.
" ఆయన చాలా సంతోషపడ్డారు. ఆయనతో అధికారులు మాట్లాడారు. చాలా ప్రశ్నలు అడిగారు. కొన్నింటికి ఆయన సమాధానం చెప్పారు. ఓ ధ్రువపత్రం, పుష్పగుచ్ఛం, ఓ మగ్గు ఇచ్చారు" -- బచ్చన్ సింగ్ కోడలు
మూడేళ్ల క్రితం వరకు సైకిల్ నడిపారు
గతంలో సైకిల్‌పై భార్యను తీసుకెళ్లి బచ్చన్ ఓటు వేసేవారని తెలిపారు ఆయన కోడలు.
" ఓటు వేసేందుకు ఆయన భార్యను వెంటబెట్టుకొని సైకిల్‌పై వెళ్లేవారు. బలహీనత కారణంగా ఆయన మూడేళ్ల క్రితమే సైకిల్ నడపడం మానేశారు. ఆయన పిల్లలు ఓటు వేసేందుకు ఆలస్యంగా వెళ్లేవారు. కానీ ఆయన మాత్రం సైకిల్‌పై ఉదయాన్నే వెళ్లి ఓటు వేసేవారు" -- బచ్చన్ సింగ్ కోడలు
ఓటు వేయాలని ఆయనెప్పుడూ తమకు చెబుతూనే ఉంటారని అన్నారు బచ్చన్ సింగ్ మనవడు గుల్చంద్ సింగ్. తమ కుటుంబంలోని ఒక్క ఓటు కూడా వృథా కాకుండా ఆయన చేశారని సంతోషంగా చెప్పారు.
బచ్చన్సింగ్ సొంత ఊరు పంజాబ్‌లోని లాల్పుర. ఆయన ఇప్పటి వరకు వచ్చిన అన్ని ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు ఆవశ్యకతను చాటిచెబుతున్నారు.
దిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు సార్వత్రిక ఎన్నికల ఆరో విడతలో భాగంగా నేడు పోలింగ్ జరగనుంది.
ఇదీ చూడండి : "నెహ్రూపై భాజపా నేత వివాదస్పద వ్యాఖ్యలు"