పౌరచట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై స్పందించింది అగ్రరాజ్యం అమెరికా. నిరసనకారులు శాంతియుతంగా సమావేశమయ్యే హక్కును భారత్ గౌరవించి రక్షించాలని సూచించింది.
సీఏఏకు వ్యతిరేకంగా ఈ వారంలో చేపట్టిన నిరసనలు మూడు దశాబ్దాల్లోనే అత్యంత హింసాత్మకంగా జరిగిన ఆందోళనలుగా పేర్కొంటున్న నేపథ్యంలో పలు సూచనలు చేసింది అమెరికా.
"భారత్లో ఇటీవల జరిగిన ఘర్షణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. శాంతియుతంగా సమావేశమయ్యే హక్కును పరిరక్షించాలని కోరుతున్నాం. ఈ ఘర్షణల్లో పాలు పంచుకున్న అన్ని వర్గాలు శాంతిని కాపాడాలని, హింసకు దూరంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాం. మత స్వేచ్ఛను పరిరక్షించడంలో భారత్ ముందుకు సాగాలని ఆశిస్తున్నాం."
-అమెరికా ప్రకటన
మరింత హింస చెలరేగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు తన ప్రకటనలో పేర్కొంది అమెరికా. అదే సమయంలో డెమొక్రటిక్ పార్టీకి చెందిన నేత కోలిన్ ఆల్రెడ్ కూడా దిల్లీ ఘర్షణల అంశమై స్పందించారు. మైనారిటీల ఆకాంక్షలను గౌరవించినప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: పుల్వామా కేసులో కీలక ఉగ్రవాది అరెస్టు