దిల్లీ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ యోగేశ్ త్యాగిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో విఫలమయ్యారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. యోగేశ్‌పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి విచారణకూ రాష్ట్రపతి ఆదేశించారు.
వర్సిటీలో అధికారం కోసం వివాదాలు నెలకొన్న నేపథ్యంలో తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. విచారణ పారదర్శకంగా సాగేందుకు త్యాగిని సస్పెండ్ చేసినట్లు కేంద్ర విద్యాశాఖ అధికారులు తెలిపారు. సస్పెన్షన్ తక్షణం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.
అయితే, నిబంధనలకు అనుగుణంగా త్యాగి తన విధులను నిర్వహించలేదని ఓ అధికారి వెల్లడించారు. ఇది విశ్వవిద్యాలయ పాలనపై ప్రభావం చూపిందన్నారు. త్యాగి గైర్హాజరు లేదా మెడికల్ లీవ్‌లో ఉన్న సమయంలో ఆయన జారీ చేసిన ఉత్తర్వులు చెల్లవని అధికారులు స్పష్టం చేశారు.
అసలేం జరిగింది?
వైద్య అత్యవసర పరిస్థితి కారణంగా జులై 2న త్యాగి.. ఎయిమ్స్‌లో చేరారు. ఆయన తిరిగి విధుల్లో చేరేవరకు త్యాగి బాధ్యతలను పీసీ జోషికి అప్పగిస్తూ జులై 17న ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అయితే, గతవారంలో జోషిని తొలగించి.. ఆయన స్థానంలో గీతా భట్‌ను నియమిస్తూ త్యాగి ఆదేశాలు జారీ చేశారు. ఈ వివాదానికి దారి తీసింది.
విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ నియామకంలోనూ ఇలాగే వ్యవహరించినట్లు త్యాగిపై ఆరోపణలు ఉన్నాయి.
ఇదీ చూడండి: 'చైనాలో లద్దాఖ్'పై ట్విట్టర్‌కు మరిన్ని చిక్కులు!