భానుడి ప్రతాపానికి ఉత్తర భారతం ఉక్కిరిబిక్కిరవుతోంది. పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగటం వల్ల వడగాలులతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఎండ వేడిమి తట్టుకోలేక బయటకు రావాలంటేనే జంకుతున్నారు.
దేశ రాజధానిలో సోమవారం 48 డిగ్రీల మేర గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని వెల్లడించింది. దిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హరియాణా, ఛండీగఢ్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
దిల్లీ నగరంలో 2014 జూన్ 9న నమోదైన 47.8 డిగ్రీల ఉష్ణోగ్రతే ఇప్పటివరకు అత్యధికం. ఇప్పుడు ఆ రికార్డును తిరగరాస్తూ 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
దేశంలో ఇప్పటికే రుతుపవనాలు ప్రవేశించగా... మధ్య భారతానికి విస్తరించేందుకు మరింత సమయం పట్టే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రానున్న నాలుగైదు రోజుల్లో దిల్లీ వాసులకు కాస్త ఉపశమనం లభించనుందని చెప్పారు. అప్పుడు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు.
ఇదీ చూడండి: కథువా కేసులో ముగ్గురికి 25 ఏళ్లు జైలుశిక్ష