అల్లర్లు, ఘర్షణల వల్ల భారత్‌కు ఎలాంటి ప్రయోజనం ఉండదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఇటీవల అల్లర్లతో అట్టుడికిన ఈశాన్య దిల్లీలో రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ నేతల బృందం పర్యటించింది. అల్లర్లలో దెబ్బతిన్న ఇళ్లు, పాఠశాలలు, వ్యాపార సముదాయాలను పరిశీలించింది. బాధితులతో మాట్లాడి వారిని రాహుల్ బృందం పరామర్శించింది. అల్లర్ల వల్ల ప్రపంచంలో భారత్ ప్రతిష్ట దెబ్బతింటుందని రాహుల్ గాంధీ అన్నారు.
"దేశాన్ని విభజించడం వల్ల, కాల్చడం వల్ల భారత్‌కు, భరతమాతకు ఎలాంటి ప్రయోజం కల్గదు. అంతా కలిసి ప్రేమతో బతికేందుకు, భారత్‌ను కలుపుకొని ముందుకు తీసుకువెళ్లేందుకు నేను ఇక్కడికి వచ్చాను. భారత్‌లో, దేశ రాజధానిలో హింస జరిగితే విదేశాల్లో భారత ప్రతిష్ట దెబ్బతింటుంది. సోదరభావం, ఐక్యత, ప్రేమ అనే భారతదేశ బలాలను ఇక్కడ కాల్చివేశారు. ఇలాంటి రాజకీయాల వల్ల కేవలం కాలిపోయిన ఇక్కడి పాఠశాలకు మాత్రమే కాదు భారతదేశానికి, భరతమాతకు నష్టం జరుగుతుంది. "
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్ర నేత