2012లో సంచలనం రేపిన నిర్భయ కేసులో నిందితుడిగా ఉన్న అక్షయ్ కుమార్ సింగ్.. తనకు విధించిన ఉరిశిక్షను పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టును కోరాడు. ఇందుకోసం అక్షయ్ దాఖలు చేసిన వ్యాజ్యంలో పేర్కొన్న విషయాలు చర్చనీయాంశమయ్యాయి. దిల్లీ ఓ గ్యాస్ ఛాంబర్(విషపూరితం) అని.. అలాంటప్పుడు తనకు మరణ శిక్ష ఎందుకని పిటిషన్లో పేర్కొన్నాడు అక్షయ్.
''కలుషిత నీరు, గాలితో దిల్లీ-ఎస్సీఆర్ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. జీవితకాలం తగ్గిపోతోంది. అలాంటప్పుడు.. మరణ శిక్ష విధించడం ఎందుకు?''
- పునఃసమీక్ష పిటిషన్లో అక్షయ్
2012లో ఘటన..
దేశ రాజధాని నడిబొడ్డున ఏడేళ్ల క్రితం 2012 డిసెంబరు 16వ తేదీ రాత్రి 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థినిపై దిల్లీలో ఆరుగురు సామూహిక అత్యాచారానికి, అత్యంత హేయమైన చర్యలకు పాల్పడ్డారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం ఆమెను సింగపూర్‌కు తరలించగా అక్కడ కన్నుమూసింది.
నిర్భయపై అత్యాచారం, హత్య కేసు దోషుల్లో ఒకడు మైనర్. మరొక దోషి రామ్‌సింగ్ 2013లో తిహార్ కారాగారంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన నలుగురికి దిల్లీ ట్రయల్ కోర్టు విధించిన మరణశిక్షను 2017లో సుప్రీం కోర్టు సమర్థించింది. ఈ కేసులోని ముగ్గురు దోషులు గతంలో దాఖలు చేసిన సమీక్ష పిటిషన్లను.. న్యాయస్థానం 2018 జులై 9న కొట్టివేసింది. మంగళవారం నాలుగో దోషి సమీక్ష వ్యాజ్యం వేశాడు.
ఇవీ చూడండి: