కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి దిల్లీ కోర్టులో చుక్కెదురైంది. ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ముందు లొంగిపోతానంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది.
ప్రస్తుతం ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో తిహార్ జైల్లో ఉన్నారు చిదంబరం. అక్కడి నుంచి బయటకు వచ్చేందుకు మాజీ ఆర్థిక మంత్రి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దిల్లీ కోర్టు తాజా తీర్పుతో ఆయన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మనీలాండరింగ్ కేసులో చిదంబరాన్ని అరెస్టు చేయడం అవసరమని.. అయితే సరైన సమయంలోనే అదుపులోకి తీసుకుంటామని గురువారమే కోర్టుకు తెలిపింది ఈడీ. ప్రస్తుతం జైల్లో ఉన్న ఆయన సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం లేదని న్యాయస్థానానికి తెలిపింది.
జైల్లో ఉంచేందుకే..!
అయితే చిదంబరంపై ఈడీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని, ఆయనను ఇబ్బంది పెట్టేందుకే ఈ విధంగా ప్రవర్తిస్తోందని వాదించారు న్యాయవాది కపిల్ సిబల్. గత నెలలో రెండు సార్లు అరెస్టు చేయడానికి వచ్చిన అధికారులు.. ఇప్పుడు ఆయనను సీబీఐ కస్టడీలో ఉంచేందుకే అదుపులోకి తీసుకోమంటున్నారని కోర్టుకు నివేదించారు.