భారత్‌లోకి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేసించడం వర్షపాతంపై గణనీయమైన ప్రభావం చూపిందని భారత వాతావరణ విభాగం (ఐఎమ్‌డీ) తెలిపింది. సాధారణంగా జూన్ 1న రుతుపవనాలు భారత్‌లోకి ప్రవేశించాల్సి ఉంది. అయితే వారం రోజులు ఆలస్యంగా ఈ నెల 8న కేరళ తీరాన్ని తాకాయి.
ఈ కారణంగా గత 9 రోజుల్లో 45 శాతం లోటు వర్షపాతం నమోదైందని ఐఎమ్‌డీ పేర్కొంది. సాధారణంగా ఈ పాటికి 32.4 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 17.7 మి.మీ వర్షం మాత్రమే కురిసిందని తెలిపింది.
రుతుపవనాల మందకొడి కారణంగా జూన్‌లో లోటు వర్షపాతం ఊహించినదాని కంటే అధికంగా ఉండే అవకాశం ఉన్నట్లు చెప్పింది. ప్రస్తుతం అరేబియా సముద్రంలో అల్పపీడన ద్రోణి ఏర్పడిందని, ఇది క్రమంగా బలపడుతూ తుపానుగా మారే అవకాశముందని తెలిపింది.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, గోవా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో 66 శాతం లోటు వర్షపాతం నమోదైందని పేర్కొంది. దక్షిణాదిన లోటు వర్షపాతం 29 శాతంగా ఉనట్లు చెప్పింది.
- ఇదీ చూడండి: సుఖోయ్ యుద్ధ విమానాల్లో బ్రహ్మోస్