ముంబయిలో నేవీకి చెందిన మాజీ అధికారిపై శివసేన కార్యకర్తలు దాడి చేయడంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. మాజీ సైనికులపై దాడుల్ని ఏ మాత్రం సహించేది లేదని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 'శివసేన కార్యకర్తల చేతిలో దాడికి గురైన నేవీ మాజీ అధికారి మదన్ శర్మతో మాట్లాడాను. ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశాను. మాజీ సైనికాధికారులపై దాడులు చేయడాన్ని ఏ మాత్రం సహించేది లేదు. మదన్‌జీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా.' అని ట్వీట్ చేశారు రాజ్‌నాథ్.
ఫడణవీస్ కూడా..
ఈ విషయమై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ స్పందిస్తూ.. 'ప్రభుత్వం ఇలాంటి చర్యలను ప్రోత్సహించడం చాలా తప్పు. రాష్ట్రంలో రౌడీయిజం ఆపాలని ఉద్ధవ్‌జీని ట్విట్టర్ వేదికగా కోరా. దాడికి కారణమైన ఆరుగురు నిందితులను నిమిషాల వ్యవధిలోనే విడిచిపెట్టడం సరైంది కాదు.. వారిపై చర్యలు తీసుకోవాలి' అని వెల్లడించారు.
క్షమాపణ చెప్పాలి..
'ఉద్ధవ్ ఠాక్రే, శివసేన కార్యకర్తలందరూ దేశానికి క్షమాపణలు చెప్పాలి. చట్టం, శాంతిభద్రతలను రక్షించలేని ఠాక్రే.. తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఆయన తర్వాత నాయకుడు ఎవరనేది ప్రజలే నిర్ణయిస్తారు.' అని మదన్ శర్మ(రిటైర్డ్ నేవీ ఆఫీరస్) అన్నారు.
అరెస్ట్.. ఆపై విడుదల
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు సంబంధించి ఎగతాళి చేసే చిత్రాలను వాట్సాప్‌లో పోస్ట్‌లో చేసినందుకు మదన్ శర్మ అనే మాజీ నేవీ అధికారిపై శివసేన కార్యకర్తలు శుక్రవారం దాడికి దిగారు. కండివలి ప్రాంతంలోని అతడి ఇంటికి వెళ్లి వెంబడించి మరీ చితకబాదటం అక్కడి సీసీ ఫుటేజీల్లో రికార్డయింది. వీడియో ఆధారంగా స్థానిక శివసేన నాయకుడు కమలేశ్ సహా ఐదుగురు నిందితులపై శుక్రవారం కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసిన పోలీసులు.. శనివారం మళ్లీ బెయిల్‌పై వదిలిపెట్టారు.
ఇదీ చదవండి: మాస్కులు కుడుతూ.. కరోనా యుద్ధాన్ని జయిస్తూ