చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో సాయుధ బలగాల సమర సన్నద్ధతను మరింత పెంచేలా రక్షణ మంత్రిత్వ శాఖ మరో కీలక ముందడుగు వేసింది. ఆరు సైనిక రెజిమెంట్ల కోసం పినాక రాకెట్ లాంఛర్లను సముపార్జించుకునేందుకుగాను దేశీయ రక్షణ ఉత్పత్తుల సంస్థలు టాటా పవర్ కంపెనీ లిమిటెడ్, లార్సెన్ &టూబ్రోలతో రూ.2,580 కోట్ల విలువైన ఒప్పందాన్ని సోమవారం కుదుర్చుకుంది.
ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ కూడా ఈ ప్రాజెక్టులో పాలుపంచుకుంటుంది. రాకెట్ లాంఛర్లను ఉంచేందుకు అవసరమైన వాహనాలను ఈ సంస్థ సరఫరా చేస్తుంది.
ఆరు పినాక రెజిమెంట్లు 114 లాంఛర్ల ఆటోమేటెడ్ గన్ ఎయిమింగ్-పొజిషనింగ్ సిస్టమ్ (ఏజీఏపీఎస్), 45 కమాండ్ పోస్టులను కలిగి ఉంటాయని రక్షణ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. 2024 కల్లా అవి విధుల్లో చేరతాయని తెలిపింది.
ఇదీ చూడండి:సరిహద్దులో చైనా ఘర్షణ- రాజకీయ రగడ