దిల్లీలోని ప్రతిష్ఠాత్మక జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ)లో విద్యార్థులపై జరిగిన దాడిలో బాధితులను పరామర్శించేందుకు బాలీవుడ్ అగ్రనటి దీపికా పదుకొణె నిన్నరాత్రి.. వర్సిటీని సందర్శించారు. అక్కడ దాదాపు 15 నిమిషాల పాటు ఉన్న ఆమె ఏం మాట్లాడకుండానే వెనుదిరిగారు. మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో క్యాంపస్‌లో బహిరంగ సభ జరుగుతుండగా విచ్చేసింది దీపికా. జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు అయిషీ ఘోష్‌ను పరామర్శించారు. ఆ తర్వాత కొందరు విద్యార్థి సంఘం నేతలతో కాసేపు మాట్లాడి వెళ్లిపోయినట్టు సమాచారం. ఈ కార్యక్రమంలో జేఎన్‌యూ ఎస్‌యూ మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ కూడా పాల్గొన్నారు.
దీపిక సందర్శనకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అయితే, ఆమె జేఎన్‌యూని సందర్శించి వెళ్లిన కొద్దిసేపటికే భాజపా నేత తేజేందర్‌పాల్ సింగ్ బగ్గా స్పందించారు. దీపిక నటించిన సినిమాలను బహిష్కరించాలంటూ ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ ఘటనపై ఇప్పటికే అనేకమంది బాలీవుడ్ ప్రముఖులు జేఎన్‌యూలో హింసాత్మక ఘటనను ఖండిస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు.
ఆదివారం సాయంత్రం కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు ముసుగులు ధరించి కర్రలు, ఇనుప రాడ్డులతో జేఎన్‌యూలోకి చొరబడి హింసాకాండకు పాల్పడిన ఘటన దేశంలో తీవ్ర కలకలం రేపింది. పలువురు విద్యార్థులు, అధ్యాపకులపై దుండగులు విచక్షణారహితంగా దాడి చేశారు.