చివరి ఏడాది పరీక్షల నిర్వహణకు యూనియన్ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వివరణ ఇచ్చారు. వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో సోమవారం భేటీ అయిన రమేశ్.. విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
" విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఈ నిర్ణయం తీసుకున్నాం. విశ్వవిద్యాలయాల వెసులుబాటును బట్టి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా పరీక్షలు నిర్వహించుకోవచ్చు. కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యావిధానం అంతర్జాతీయ స్థాయిలో భారత్ స్థానాన్ని బలోపేతం చేస్తుంది. 2035 నాటికి విద్యార్థులు స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్)ను 50 శాతం (3.5 కోట్ల మంది విద్యార్థులు) పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం."
- రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్, కేంద్ర విద్యాశాఖ మంత్రి
చివరి సంవత్సరం పరీక్షల నిర్వహణకు సంబంధించి విశ్వవిద్యాలయాలకు యూజీసీ జులై 6న మార్గదర్శకాలు జారీ చేసింది. వీటిని సవాలు చేస్తూ పరీక్షలు రద్దు చేయాలని సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి.
ఇదీ చూడండి: 'కేంద్ర విద్యా శాఖ' పేరుకు రాష్ట్రపతి ఆమోదం