మహారాష్ట్రలో వరద బీభత్సానికి మరణించిన వారి సంఖ్య 50కి చేరుకుంది. మరో ముగ్గురి ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్నారు. వరదలు తగ్గుముఖం పట్టడం వల్ల మరిన్ని మృతదేహాలను గుర్తించడానికి వీలైందని చెబుతున్నారు.
గత 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు 12 జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపాయి. ముఖ్యంగా పశ్చిమ మహారాష్ట్రలోని కొల్హాపుర్, సంగ్లీ జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. అయితే ప్రస్తుతం అక్కడ వరదలు తగ్గుముఖం పట్టాయి. కృష్ణ, పంచగంగా నదుల్లో నీటి మట్టం ప్రమాదకర స్థాయి కంటే దిగువకు వచ్చిందని అధికారులు తెలిపారు.
"కొల్హాపూర్ జిల్లా రాజారాం వీర్ వద్ద పంచగంగా నది 41.6 అడుగుల నీటిమట్టంలో ప్రవహిస్తోంది. సంగ్లీ వద్ద కృష్ణానది నీటిమట్టం 39.1 అడుగులుగా ఉంది." -అధికారులు
ప్రస్తుతం సంగ్లీ, కొల్హాపుర్ జిల్లాల్లో 6.45 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
ఆల్మట్టి నుంచి దిగువకు నీటి విడుదల
మహారాష్ట్ర ప్రభుత్వ కోరిక మేరకు కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఆనకట్ట నుంచి వరద నీటిని దిగువకు విడుదల చేసింది. వరదల నుంచి మహారాష్ట్ర కోలుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.6,813 కోట్ల సాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కోరారు.
రెండు రోజుల్లో... రూ.20 కోట్ల ఆర్థికసాయం
వరద బాధితులకు ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ చేసిన విజ్ఞప్తికి మంచి స్పందన వచ్చింది. వివిధ రంగాల ప్రజలు, సంస్థలు కేవలం రెండు రోజుల్లోనే రూ.20 కోట్లను ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం అందించారు.
ఈ ఏడాది సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, కవి సుశీల్‌కుమార్ షిండే.... వ్యక్తిగతంగా ఫడణవీస్ కలుసుకుని ప్రైజ్‌మనీ 50 వేల రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు.
మధ్యప్రదేశ్‌లో వరదల బీభత్సం
భారీ వరదలు మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. మాండసోర్ జిల్లాలో వరదల్లో చిక్కుకుని ఓ మహిళ, ఆమె కుమార్తె, సహా ముగ్గురు మహణించారు. సహాయక చర్యలు ముమ్మరం చేసిన అధికారులు 3 వేల మందిని సహాయక శిబిరాలకు తరలించారు.
శివానీ నదీ జలాలు ప్రసిద్ధ పశుపతినాథ్ మహదేవ్ ఆలయంలోకి ప్రవేశించాయి. రాష్ట్రంలోని నర్మదా, క్షిప్ర, బెట్వా, తావా, చంబల్, పార్వతి నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.
ఇదీ చూడండి: పెరిగిన ఎగుమతులు.. 4 నెలల కనిష్ఠానికి వాణిజ్య లోటు