వరద విలయంలో చిక్కిన కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో ఇప్పటివరకు 192 మంది మృతి చెందారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. లక్షలాది మంది ఇంకా పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారు.
ఒక్క కేరళలోనే 76 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్లో కలిపి 116 మంది బలయ్యారు.
విరిగిన కొండచరియలు...
ఉత్తరాఖండ్ ఛమోలీ జిల్లాలోని 3 గ్రామాల్లో కొండచరియలు విరిగి పడి.. మొత్తం ఆరుగురు మృతి చెందారు. జమ్ముకశ్మీర్‌లోని రిసాయి జిల్లాలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
కేరళలో...
కేరళలో చాలా ప్రాంతాల్లో వర్షాలు తగ్గాయి. కొండచరియలు విరిగిపడిన మలప్పురం, వయనాడ్ జిల్లాల్లో సహాయ చర్యలను వేగంగా సాగుతున్నాయి. గల్లంతైన వారిలో మలప్పురానికి చెందినవారే 50 మంది ఉన్నారు.
వరదల కారణంగా ఈ జిల్లాలోనే అత్యధికంగా 24 మంది మృతి చెందారు. రెడ్ అలెర్ట్ ప్రకటించిన జిల్లాల్లో హెచ్చరికలను ఉపసంహరించారు. కేరళలో ఏర్పాటుచేసిన 1,654 పునరావాస కేంద్రాల్లో 2 లక్షల 87మంది తలదాచుకుంటున్నారు. కాంగ్రెస్ నేత, వయనాడ్ లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు.
కర్ణాటక...
కర్ణాటకలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోనూ పరిస్థితులు కుదుటపడుతున్నాయి. సహాయ, పునరావాస కార్యక్రమాలు జోరందుకున్నాయి. 17 జిల్లాల్లోని 80 తాలూకాలు వరదలతో అల్లాడిపోయాయి. వర్షాల కారణంగా కర్ణాటకలో 42 మంది మృతి చెందారు. 12 మంది గల్లంతయ్యారు. ఇప్పటివరకు 5 లక్షల 81 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 3 లక్షల 32 వేల మంది పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు.
మహారాష్ట్ర...
మహారాష్ట్రలో వరదలు శాంతించాయి. సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. వారం రోజులుగా మూతపడి ఉన్న ముంబయి- బెంగళూరు జాతీయ రహదారిపై పాక్షికంగా రాకపోకలు మొదలయ్యాయి. కొల్హాపుర్ జిల్లాలో వరదలు తగ్గుముఖం పట్టడం వల్ల షిరోలి వంతెనపై ఒకవైపు నుంచి వాహనాలను అనుమతిస్తున్నారు.
గుజరాత్...
గుజరాత్‌లోని కచ్ జిల్లాలో రహదారిపై ఉన్న 125 మంది వరదలకు కొట్టుకుపోయారు. వీరందరినీ వాయుసేన కాపాడింది.
- ఇదీ చూడండి: భుజాలపై 2 కి.మీ ప్రయాణం.. అంబులెన్స్‌లో ప్రసవం!